Pakistan Crisis: పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలతో పాటు గ్యాస్, ఇంధన ధరలు పెరగటం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
తాజాగా పాకిస్థాన్‌లో గ్యాస్ సిలిండర్ ధర 246.15 పాకిస్థానీ రూపాయలు పెరిగింది. దీంతో అక్కడ సిలిండర్ ధర 3,079.64 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం పాకిస్థాన్‌లో సామాన్య ప్రజల సమస్యలను పెంచేస్తోంది. సెప్టెంబర్‌లో వార్షిక ప్రాతిపదికన ద్రవ్యోల్బణం 31.4 శాతానికి చేరుకున్నట్లు స్టాటిస్టిక్స్ బ్యూరో డేటా వెల్లడించింది.

పాకిస్థాన్‌కు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ(OGRA) లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) ధరను కిలోకు 20.86 పాకిస్థాన్ రూపాయలు పెంచగా కిలో ధర రూ.260.98కి చేరుకుంది. అలాగే డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ.246.15 పెంచటంతో సిలిండర్ కొత్త ధర రూ.3,079.64కి చేరుకుంది. ఐఎమ్ఎఫ్ 3 బిలియన్ డాలర్ల బెయిలౌట్ కార్యక్రమంలో షరతులకు అనుగుణంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇంధన ధరలను పెంచినట్లు వెల్లడైంది.
2023 రెండవ అర్థభాగంలో ద్రవ్యోల్బణం నుంచి పాకిస్థాన్ ప్రజలకు ఉపశమనం లభించొచ్చని తెలుస్తోంది. పాకిస్థాన్‌లో రవాణా ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే 2023 సెప్టెంబర్‌లో 31.26% పెరిగాయి. అదే సమయంలో ఆహార ధర 33.11 శాతం పెరిగింది. గృహాలు, నీరు, విద్యుత్ ధరలు 29.70 శాతం పెరిగాయి. రెండు వరుస పెంపుదల తర్వాత పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను రికార్డు గరిష్థ స్థాయిల నుంచి తగ్గించడంతో ద్రవ్యోల్బణం రానున్న కాలంలో తగ్గుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications