Dollar Gains: ఇప్పుడిప్పుడే అంతా చక్కబడుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో సౌదీ ప్రపంచ దేశాలపై ఆయిల్ బాంబ్ విసిరింది. దీంతో చమురు ధరలు భగ్గుమనటం ప్రారంభించాయి. ప్రస్తుతం దాదాపు 80 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ధర రానున్న కాలంలో 100 డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై ప్రతికూలంగా పడింది.
ప్రపంచం ఉలిక్కిపడేలా ఆశ్చర్యకర ప్రకటన చేసిన తరుణంలో డాలర్ బలపడటం ప్రారంభమైంది. ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రేట్ల పెంపుకు ఫెడ్ ఉపక్రమించటంతో మార్కెట్లో లిక్విడిటీ భారీగా తగ్గింది.. దీంతో ఇప్పటికే అమెరికాలోని కొన్ని బ్యాంకులు సంక్షోభంలోకి జారుకున్నాయి. అయితే రానున్న కాలంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నందున డాలర్ కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొత్తవారం US డాలర్ పెరుగుదలను ప్రారంభించింది.

సౌదీ అరేబియా, రష్యా ప్రతినిధులతో కూడిన ఒపెక్ + మంత్రుల ప్యానెల్ వర్చువల్ సమావేశానికి ముందే ఉత్పత్తి కోతలపై ప్రకటన వచ్చింది. ఈ క్రమంలో యూరో 0.25% క్షీణించి $1.0812కి చేరుకుని ఒకవారం కనిష్ఠ స్థాయికి చేరుకుంది. డాలర్ తో జపనీస్ యెన్ 0.04% బలహీనపడి 132.86కి చేరుకుంది. స్టెర్లింగ్ ఒకవారం కనిష్ఠ స్థాయి $1.22825ను తాకడంతో రోజులో 0.22% తగ్గి $1.2305 వద్ద ఉంది. రూపాయి సైతం డాలర్ బలపడటంతో బక్కచిక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
డాలర్ బలపడటం కచ్చితంగా భారత వాణిజ్య చెల్లింపులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది దిగుమతుల భారాన్ని పెంచుతుందని వారు చెబుతున్నారు. ప్రధానంగా భారత్ చమురు దిగుమతుల కోసం అత్యధికంగా ఆధారపడుతున్న తరుణంలో డాలర్ బలపడటం కొంత ఆందోళనకరమైన అంశమేనని నిపుణులు అంటున్నారు. ఇది ట్రేడ్ డెఫిసిట్ మరింత పెంచుతుందని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications