ఆ రెండు తొందరపాటు: మోడీ 5 ట్రిలియన్ డాలర్ల కలపై అహ్లూవాలియా షాకింగ్ కామెంట్స్
2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల (రూ.5 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోడీ కలలు కంటున్నారు. దీనిపై ఆర్థిక నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. జీడీపీ వృద్ధి రేటు పెరిగితే ఇది సాధ్యమేనని కొందరు, మోడీ కల నెరవేరాలంటే జీడీపీ 9 శాతానికి పైగా ఉండాలని అది కష్టసాధ్యమని మరికొందరు, కాస్త ఆలస్యమైనా ఆ టార్గెట్ చేరుకోవడం తథ్యమని మరికొంతమంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తాజాగా, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా దీనిపై స్పందించారు.

మోడీ కలపై అహ్లూవాలియా
2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న మోడీ కల అప్పుడే నెరవేరదని, అయితే దీనికి కొంత సమయం పడుతుందని మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అన్నారు. యూపీఏ పాలన, నాటి అభివృద్ధి కార్యక్రమాల ఇతివృత్తంగా ఆయన రాసిన 'బ్యాక్ స్టేజ్: ది స్టోరీ బిహైండ్ ఇండియన్ హైగ్రోత్ ఇయర్స్' పుస్తకావిష్కరణ సందర్భంగా మాట్లాడారు.

ఈ రెండు తప్పిదాలు..
ప్రస్తుత ప్రభుత్వం రెండు పాలసీ తప్పులు చేసిందని అహ్లూవాలియా అన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు.. ఈ రెండు కూడా తొందరబాటు నిర్ణయాలు అన్నారు. 2016లో నోట్ల రద్దు, ఆ తర్వాత ఏడాదిలో జీఎస్టీని మోడీ మొదటి ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.

5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా ఎదగాలంటే...
భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే 9 శాతం వృద్ధి రేటు నమోదు కావాలని అహ్లూవాలియా అన్నారు. ఇది కూడా 2019-20 నుండి వరుసగా 2024-25 వరకు ఈ వృద్ధిని నమోదు చేయాలన్నారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు కేవలం 5 శాతంగానే అంచనా వేస్తున్నారని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకున్నప్పటికీ వచ్చే ఏడాదికి 9 శాతం వృద్ధి రేటు సాధ్యం కాదన్నారు.

ఉద్యోగ, ఉపాధి కల్పించాలి
భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని, కానీ దానికి కొన్నేళ్లు పడుతుందని అహ్లూవాలియా అన్నారు. తొలుత సాధ్యమైనంత త్వరగా 8 శాతం వృద్ధి రేటుకు చేరుకోవడం తొలి వాస్తవిక లక్ష్యం కావాలని సూచించారు. పేదరికాన్ని తగ్గించడం, యువతకు ఉద్యోగ, ఉపాది కల్పించడం అవసరమన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభుత్వం తీసుకున్న తొందరబాటు నిర్ణయాలు అని అభిప్రాయపడ్డారు.

వృద్ధి రేటు అందుకోవడం సులభం
యూపీఏ మొదటి ఏడు సంవత్సరాలలో వృద్ధి రేటు 8.5 శాతంగా నమోదయిందని అహ్లూవాలియా అన్నారు. ఈ వృద్ధి రేటును తిరిగి అందుకోవడం సులభం అన్నారు. 2018-19లో భారత వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంది. 2019-20లో 5 శాతానికి పడిపోతుందని అంచనా. 2020-21లో 6.5 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications