హోటల్ పెట్టేకన్నా.... పిస్టల్ కొనటం ఈజీ! ఇండియాలో పరిస్థితిపై ఆర్థిక సర్వే నివేదిక
ఇండియాలో ఒక కొత్త బిజినెస్ పెట్టాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టాలంటేనే 26 రకాల అనుమతులు తీసుకోవాలి. లేదా ఒక హోటల్ / రెస్టారెంట్ నెలకొల్పాలంటే అంతకంటే ఎక్కువ పనే ఉంటుంది. కానీ మన దేశంలో ఒక గన్ను (పిస్టల్) కొనుగోలు చేయటం చాలా సులువుగా ఉంది. ఇది మనకు మనం అనుకునే విషయం కాదు. సాక్షాత్తూ ఆర్థిక సర్వే నివేదికలోనే ఈ విషయం వెల్లడించటం విశేషం. దేశంలో సిటీ ని బట్టి హోటల్ లేదా రెస్టారెంట్ నెలకొల్పాలంటే 36 నుంచి 45 రకాల అనుమతులు అవసరం అవుతున్నాయి. ఈ విషయంలో ఢిల్లీ, బెంగళూరు లో ఎక్కువ అనుమతులు అవసరం అవుతుండగా.. ఇతర మహా నగరాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. అదే సమయంలో ఒక గన్ లైసెన్స్ తీసుకునేందుకు లేదా ఫైర్ వర్క్స్ లైసెన్స్ తీసుకునేందుకు మాత్రం కేవలం 12 నుంచి 19 అనుమతులు సరిపోతున్నాయి. ఇదేం విచిత్రమో ప్రభుత్వమే చెప్పాలని, పరిస్థితిలో వీలైనంత త్వరగా మార్పులు తీసుకురావాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎకనమిక్ సర్వే.. మరిన్ని కథనాలు

చైనా లో కేవలం 4 అనుమతులు ...
ఏ దేశంలోనైనా ఆతిథ్య రంగం ( హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ) పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటుంది. వేగంగా వృద్ధి చెందుతుంది. అయినా కూడా ఈ రంగంలో కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి భారత్ లో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. పేరుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పదం కానీ... వాస్తవిక పరిస్థితులను గమనిస్తే అంతా విరుద్ధమే. సరళతరమైన అనుమతుల విషయంలో మనం మన పొరుగు దేశాల నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. చైనా లో ఒక కొత్త రెస్టరెంట్ తెరిచేందుకు కేవలం 4 అనుమతులు సరిపోతాయి. సింగపూర్ లోనూ అంతే. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

ఆన్‌లైన్‌కు మళ్ళినా లాభం లేదు..
ఇండియా లో డిజిటల్ రెవల్యూషన్ మొదలైంది. అది అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా వరకు అనుమతులను ఆన్లైన్ లో మంజూరు చేస్తున్నాయి. అయినా కానీ పరిస్థితిలో ఆశించిన స్థాయి పురోగతి లేదు. ఒక వ్యాపారానికి ఎన్ని అనుమతులు కావాలో, వాటిని ఎక్కడెక్కడ తీసుకోవాలో స్పష్టంగా చెప్పే ఒక్క వ్యవస్థ కూడా ఇండియా లో లేదు. ఒక డిపార్ట్మెంట్ కు వెళ్ళినప్పుడు, వారు లేవనెత్తే సందేహాలకు అనుగుణంగా మరో డిపార్ట్మెంట్ లో మరో అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది. అది నిజానికి అవసరమా కాదా అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఒక ఫైల్ ను ఎంత త్వరగా ఆమోదించాలో కాకుండా, దాన్ని ఎలా డిపార్టుమెంట్ల చుట్టూ తిప్పాలో మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్లకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే, ఒకటి రెండు అనుమతులు అవసరమైన చోట 10 కి పైగా కోరుతారు.

న్యూజిలాండ్ ఆదర్శం..
హోటల్స్, రెస్టారెంట్లు సహా అనేక వ్యాపారాల లైసెన్సులు పొందేందుకు న్యూజిలాండ్ ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ ఆన్లైన్ లోనే అనుమతులు మంజూరు చేస్తారు. కానీ అది ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తుంది. పైగా, హోటల్స్ తో పాటు ఏ రంగంలో కొత్త వ్యాపారం నెలకొల్పాలన్నా అందుకు అవసరమైన టెంప్లేట్ ప్రణాళికలు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే వాటిని అనుసరించి వారి వ్యాపారాలను మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు. కేవలం అనుమతులకు పరిమితం కాకుండా, కొత్త వ్యాపారులకు మద్దతునిచ్చే ఇలాంటి సేవలు అందించటం నిజంగా ఆదర్శమే కదా? ఇండియా లో కూడా ఇలాంటి సేవలు అందుబాటులోకి వస్తే బాగుండు. చూడాలి మరి ఎప్పుడు మారతారో మన పాలకులు.


Click it and Unblock the Notifications