DMart Q4 results తరువాత భారీ నష్టాల్లో షేర్లు
ముంబై: డీ మార్ట్. మెట్రో నగరాలు, ఓ మోస్తరు పట్టణవాసులకు చిరపరిచితమైన పేరు. బహిరంగ మార్కెట్‌తో పోల్చుకుంటే అన్ని రకాల నాణ్యమైన వస్తువులను కాస్త తక్కువ ధరకే, ఒకేచోట లభించే హైపర్ రిటైల్ చైన్ మార్కెట్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ హైపర్ చైన్ మార్కెట్లను లీడ్ చేస్తోన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దమ్ము చూపింది.
నెట్ ప్రాఫిట్‌లో 8.3 శాతం పురోభివృద్ధిని సాధించింది. 505.26 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2022-2023 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 505.26 కోట్ల రూపాయలతో 8.3 శాతం మేర నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసుకుంది. 2021-2022 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోల్చుకుంటే 39 కోట్ల రూపాయలు అధికం.

గత ఏడాది ఇదే కాలానికి డీమార్ట్ 466.35 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ సారి ఈ మొత్తం 505 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం ఆదాయంలో 21.11 శాతం మేర వృద్ధి కనిపించింది. 10,337.12 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 8,606.09 కోట్ల రూపాయలుగా నమోదైంది.
ఏడాది మొత్తానికి ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్, డిప్రియేషన్స్ అండ్ అమోర్టైజేషన్ (ఈబీఐటీడీఏ)ను పరిగణనలోకి నమోదైన రాబడి ట్యాక్సులు పోనూ 783 కోట్ల రూపాయలుగా తేలింది. ఈ నాలుగో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 18 కొత్త డీమార్ట్ స్టోర్స్‌ను తెరిచింది అవెన్యూ సూపర్‌మార్ట్స్. దీనితో ఈ సంఖ్య 324కు చేరినట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.
ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నప్పటికీ- ఫలితాలను వెల్లడించిన మరుసటి రోజే అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ల ధరలు భారీగా నష్టపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇవ్వాళ నష్టాలతో ట్రేడింగ్‌ను ఆరంభించింది అవెన్యూ సూపర్‌మార్ట్స్. తొలి రెండు గంటల్లోనే ఒక్కో షేర్ ధలో రూ.138.20 పైసల మేర క్షీణత కనిపించింది. ఈ ఉదయం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లల్లో నష్టాలతో డీమార్ట్ షేర్లు ఆరంభం అయ్యాయి.
ఒక్కో షేర్ మీద రూ.73.05 పైసల మేర నష్టం కనిపించింది. ట్రేడింగ్ ఆరంభమైనప్పటి నుంచీ ఏ స్థాయిలో కూడా పుంజుకోలేదు. నష్టం మరింత పెరుగుతూ వెళ్లిందే తప్ప ఎక్కడే గానీ లాభాల్లోకి రాలేదు. లోయర్ సర్క్యుట్‌లోనే షేర్లు ట్రేడింగ్ అవుతున్నాయి. తొలి రెండు గంటల సమయం ముగిసే సరికి అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ షేర్ ధర 3,538.55 రూపాయలుగా నమోదైంది. ఇంట్రాడే మొత్తం ఈ కంపెనీ షేర్ల ధరలు నష్టాల్లోనే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications