Reliance: దీపావళికి ముఖేష్ అంబానీ ఉద్యోగులకు స్పెషల్ గిఫ్ట్స్.. ఏమేమున్నాయంటే?
Ambani Diwali Gift: దీపావళి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు జరుపుకునే పండుగల్లో ఒకటి. ఈ సందర్భంగా కార్పొరేట్ కంపెనీల నుంచి చిన్న ఆఫీసుల వరకు అన్నీ తమ ఉద్యోగులకు స్పెషల్ గిఫ్ట్స్ అందిస్తుంటాయి. కొన్ని కంపెనీలు గిఫ్ట్ ప్యాక్స్ ఇస్తుండగా.. మరికొన్ని మాత్రం కూపన్స్ రూపంలో డబ్బులు గిఫ్ట్ చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు క్యాష్ బోనస్ అందిస్తూ ఉద్యోగులను సంతోష పెడుతుంటాయి. ఈ క్రమంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన ఉద్యోగులకు మూడు ప్యాకెట్లతో కూడిన బాక్సును దీపావళికి గిఫ్టుగా అందించారు. అసలు ఇందులో ఏమేమి ఉన్నాయనే వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
వాస్తవానికి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో పనిచేస్తున్న మహిళా సాఫ్ట్‌వేర్ డెవలపర్ దీపావళికి కంపెనీ అందించిన గిఫ్ట్ ప్యాక్ అన్‌బాక్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇందులో "హ్యాపీ దీపావళి" అని వ్రాసిన ఒక తెల్లటి పెట్టెతో పాటు జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష ప్యాకెట్లు ఉన్నాయి. అలాగే పెట్టె లోపల రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ-శ్లోకా మెహతా, ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ-రాధిక మర్చంట్, కుటుంబంలోని నలుగురు చిన్న పిల్లల నోట్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది వీడియోపై తమ అభిప్రాయాన్ని పంచుకోవటంతో పాటు కంపెనీ అందించిన దీపావళి కానుకపై పలువురు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

ఒక యూజర్ తన కంపెనీ ఎయిర్ ఫ్రైయింగ్ మెషీన్ గిఫ్ట్ చేసినట్లు వెల్లడించాడు. మరో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈసారి క్యాష్ బోనస్ అందుకున్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం కూడా రిలయన్స్ తన ఉద్యోగులకు బాదం, డ్రై ఫ్రూట్స్‌తో కూడిన పింక్ బాక్స్‌ను బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో అంబానీ చిన్న కుమారుడు అనంత్ వివాహం రాధికా మర్చంట్ తో ఈ ఏడాది జూలై జరిగిన సందర్భంలో కూడా రిలయన్స్ ఉద్యోగులు కూడా గిఫ్ట్ బాక్స్‌లను అందుకున్నారు. చాలా మంది రిలయన్స్ ఉద్యోగులు తమ వివాహ గిఫ్ట్ బాక్స్‌ల వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రిలయన్స్ ఫౌండేషన్ గిఫ్ట్..
నీతా అంబానీ నేతృత్వంలో కొనసాగుతున్న రిలయన్స్ ఫౌండేషన్ వ్యాపార సహచరులకు పంపిన దీపావళి బహుమతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కళాకారులు రూపొందించిన మట్టి దీపం, శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్ కార్డ్, బాదం ప్యాకెట్, అగరబత్తీలు, చిన్న వెండి గణేశ విగ్రహం మొదలైనవి ఉన్నాయి. బహుమతిలోని కొన్ని వస్తువులు కళాకారుడి చిత్రంతో ట్యాగ్ చేయబడ్డాయి.


Click it and Unblock the Notifications