Reliance: అమెరికాకు చెందిన ప్రఖ్యాత దిగ్గజ సంస్థ వాల్ట్ డిస్నీ.. ఇండియాలో తన వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టింది. దీనిని దక్కించుకునేందుకు పలువురు దేశీయ దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ బడా వ్యాపారవేత్త చర్చలు సైతం జరిపారట.
వాల్ట్ డిస్నీ ఇండియాలోని తన స్ట్రీమింగ్ మరియు టెలివిజన్ వ్యాపారాన్ని విక్రయించేందుకు భారత బిలియనీర్ ముఖేష్ అంబానీ కంపెనీని రీచ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో స్వోర్ట్స్, డిస్నీ+హాట్ స్టార్ అమ్మకం కోసం ప్రాథమిక చర్చలు సైతం జరిపినట్లు తెలియవచ్చింది. అయితే ఇవికాస్తా ఒప్పందం వరకు వెళ్లే అవకాశం కనిపించడం లేదని సమాచారం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) క్రికెట్ టోర్నమెంట్ స్ట్రీమింగ్ హక్కులు.. డిస్నీ నుంచి వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కు సంక్రమించడంతో పునరాలోచనలో పడినట్లు బ్లూమ్ బెర్గ్ జూలైలోనే నివేదించింది. భారత్ లోని తన వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడం లేదా జాయింట్ వెంచర్ ఏర్పాటు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు అప్పుడే చెప్పింది. ఇందులో భాగంగా వాటా కొనుగోలు గురించి రిలయన్స్ ను డిస్నీ సంప్రదించినట్లు తెలిసింది.
ఈ విషయంపై రిలయన్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. వివిధ అవకాశాలను కంపెనీ అంచనా వేస్తుంది. సమయం వచ్చినప్పుడు అవసరమైన సమాచారాన్ని ప్రకటిస్తుంది అంటూ మరింత వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. జియో సినిమా ప్లాట్ ఫారమ్ ద్వారా మేలో రికార్డు స్థాయిలో 32 మిలియన్ల మంది ఒకేసారి IPL ఫైనల్ మ్యాచ్ ను వీక్షించడంతో.. రిలయన్స్ మంచి జోరుమీదుంది. అయితే డిస్నీ డీల్ పై ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి మరి!


Click it and Unblock the Notifications