Direct Tax Collection: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల విభాగంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3.80 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11 శాతం అధికమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
2023-24 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ముందస్తు పన్ను వసూళ్లు జూన్ 17 నాటికి దాదాపు రూ.1,16,776 కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 13.70 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రచురించిన నివేదిక ప్రకారం జూన్ 17 నాటికి ప్రత్యక్ష పన్ను కింద రూ.3,79,760 కోట్లు వసూలు అయ్యాయి.

వసూలైన ప్రత్యక్ష పన్నుల్లో రూ.1,56,949 కోట్లు కార్పొరేషన్ పన్ను కాగా.. వ్యక్తిగత ఆదాయపు పన్ను అండ్ సెక్యూరిటీల లావాదేవీల పన్ను కింద మొత్తం రూ.2,22,196 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. కొత్త ఆర్థిక సంవత్సరం జూన్ 17 వరకు అంటే కేవలం 78 రోజుల్లో రీఫండ్‌లకు ముందు మొత్తం పన్ను వసూళ్లు రూ.4.19 లక్షల కోట్లుగా నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 12.73 శాతం వృద్ధి.
ఇందులో కార్పొరేషన్ పన్ను రూ.1.87 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను, సెక్యూరిటీల లావాదేవీల పన్ను రూ.2.31 లక్షల కోట్లు. జూన్ 17 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.39,578 కోట్ల రీఫండ్‌లు జారీ చేయబడ్డాయి. ఇది గతేడాది కంటే 30 శాతం ఎక్కువ.


Click it and Unblock the Notifications