కరోనా ముందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్, నోట్ల రద్దు తర్వాత 50% పెరిగిన కరెన్సీ చలామణి
కరోనా మహమ్మారి నేపథ్యంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పుంజుకున్నాయి. వైరస్‌కు భయపడి సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడంతో పాటు ఇతర జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తిస్తుందనే ఆందోళనతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ మరో అంశం కూడా ఉంది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ఇన్నాళ్లు నగదును నిల్వ చేసుకున్న వారు వాటిని బయటకు తీయడంతో కరెన్సీ నోట్లకు కూడా డిమాండ్ పెరిగింది.
ఆర్బీఐ డేటా ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల వ్యాల్యూ రూ.26,56,476 కోట్లుగా ఉంది. 2019 సెప్టెంబర్ 27 నాటికి రూ.21,60,124 కోట్లుగా ఉంది. అంటే కరెన్సీ సర్క్యులేషన్ 23% పెరిగింది. 2020 మార్చి 31వ తేదీ నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల చలామణి రూ.23,49,715 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో చలామణిలోకి వచ్చిన కరెన్సీ నోట్ల వ్యాల్యూ 14.7 శాతం, నోట్ల సంఖ్య 6.6 శాతం పెరిగింది.

నగదు చలామణి
కరోనా మహమ్మారి నేపథ్యంలో కరెన్సీకి కూడా డిమాండ్ పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 2019-20 వార్షిక నివేదికలో తెలిపింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీ నుండి సెప్టెంబర్ 25వ తేదీ మధ్య నగదు చలామణి రూ.7,540 కోట్ల మేర క్షీణించింది. సెప్టెంబర్ 11వ తేదీ నుండి రూ.13,412 కోట్ల మేర తగ్గాయి. అంతకుముందు రూ.26,69,888 కోట్లుగా ఉంది.

డిజిటల్ పేమెంట్స్
నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) డేటా ప్రకారం డిజిటల్ పేమెంట్స్ కరోనా మహమ్మారి పూర్వస్థితికి చేరుకున్నాయి. ప్రజలు కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చెల్లించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సెప్టెంబర్ నెలలో యూపీఐ ప్లాట్‌ఫాం ద్వారా రూ.3.29 లక్షల కోట్ల వ్యాల్యూ కలిగిన 180 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఆగస్ట్ నెలలో రూ.2.98 లక్షల కోట్ల వ్యాల్యూ కలిగిన 161 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి.

ఈ-ట్రాన్సాక్షన్స్
సెప్టెంబర్ నెలలో ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్(IMPS) ఆల్ టైమ్ గరిష్టం రూ.2.48 లక్షల కోట్లతో 2.79 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. భారత్ బిల్ పే ద్వారా రూ.3,920.83 కోట్ల వ్యాల్యూ కలిగిన 2.31 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి.
సెప్టెంబర్ నాటికి డెబిట్, క్రెడిట్ కార్డు ఖర్చులు కూడా కరోనా ముందు జనవరి స్థాయికి వచ్చాయి. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగిందని, దాంతో ఈ-కామర్స్ సైట్స్‌కు డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు.

నోట్ల రద్దు తర్వాత కరెన్సీ సర్క్యులేషన్ ఎంత పెరిగిందంటే
2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. బ్లాక్ మనీ ఏరివేతతో పాటు ప్రజలు నగదుపై ఆధారపడటాన్ని తగ్గించి, డిజిటల్ చెల్లింపులకు మొగ్గు చూపేందుకు నోట్ల రద్దు ఉపయోగపడింది. 2016 నవంబర్ 4వ తేదీ నాటికి వ్యవస్థలో చలామణి అవుతున్న కరెన్సీ వ్యాల్యూ రూ.17,74,187 కోట్లు. ఈ నాలుగేళ్లలో అంటే ఈ సెప్టెంబర్ 25వ తేదీ నాటికి కరెన్సీ చలామణి 49.73 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications