Paytm Crisis: దేశంలోని చెల్లింపు వ్యవస్థల రూపురేకలు మార్చిన కంపెనీల్లో ప్రధానంగా పేటీఎం పేరు చరిత్రలో ఎల్లప్పుడూ నిలిచిపోతుంది. డిజిటల్ చెల్లింపుల విప్లవానికి గట్టి పునాది వేసిన సంస్థ ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ కఠిన చర్యల తర్వాత కోలుకోలేని దెబ్బలు తింటోంది.
తాజాగా పేటీఎంకు సంబంధించి మరో పెద్ద వార్త బయటకు వచ్చింది. చెల్లింపు సేవల్లో పేటీఎం పెట్టుబడి ఆమోదాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. చైనా కంపెనీల ప్రమేయం కారణంగా పేటీఎం పేమెంట్ సర్వీసెస్‌లో రూ.50 కోట్ల పెట్టుబడికి ఆమోదం ప్రభుత్వం ఆలస్యం చేసిందని రాయటర్స్ వార్తా సంస్థ నివేదించింది. దీనిపై స్పందించిన పేటీఎం.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సమ్మతి లేదా పెనాల్టీకి సంబంధించిన ఎలాంటి సూచనను ఇవ్వలేదని పేర్కొంది. చైనా కంపెనీల వాటాకు సంబంధించిన అంచనాలు పూర్తిగా అవాస్తవమని, తప్పుదోవ పట్టించేవని కూడా కంపెనీ స్పష్టం చేసింది.

గత సంవత్సరం కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో తన పెట్టుబడిని ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరింది. చెల్లింపు అగ్రిగేటర్ లైసెన్స్ పొందడానికి పేటీఎం చెల్లింపు సేవకు ఆమోదం ముఖ్యం. అయితే చైనా ప్రమేయాన్ని బట్టి, భారత ప్రభుత్వ ప్యానెల్ ఆమోదం అవసరం, ఇందులో హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి ఒక్కొక్కరి చొప్పున ప్రతినిధి ఉంటారని రాయిటర్స్ వెల్లడించింది. రిజర్వు బ్యాంక్ పర్యవేక్షణలో ఉన్న పేటీఎం కంపెనీలో చైనాకు చెందిన యాంట్‌ఫిన్ సంస్థకు 9.88 శాతం వాటా ఉంది.
ఈ ఏడాది జనవరిలో పేటీఎం కంపెనీకి రిజర్వు బ్యాంక్ ఆంక్షలు పెద్ద చావుదెబ్బ తగిలేలా చేశాయి. ఆ తర్వాత్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో పదవికి సురీందర్ చావ్లా ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. చావ్లా జూన్ 26, 2024న PPBL నుంచి రిలీవ్ చేయబడతారని కంపెనీ స్టాక్ మార్కెట్‌కి తెలిపింది. ఆర్బీఐ చర్యలతో ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, ఇతర సాధనాల్లో డిపాజిట్లు లేదా టాప్-అప్‌లు చేయకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని RBI నిషేధించిన సంగతి తెలిసిందే. మార్చి 15 తర్వాత కస్టమర్‌లతో కొత్త లావాదేవీలు నిర్వహించకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో విజయ్ శేఖర్ శర్మకు 51 శాతం వాటా ఉంది.


Click it and Unblock the Notifications