Gold: రూపాయికే బంగారం! పేటీఎం, ఫోన్ పేలలో డిజిటల్ గోల్డ్ వెల్లువ! ఇవి సేఫేనా?
బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. భారతీయులకు పసిడిపై ఉన్న మక్కువ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా యువత, మధ్యతరగతి ప్రజలు భౌతిక బంగారం కంటే డిజిటల్ గోల్డ్ (Digital Gold) వైపు మొగ్గు చూపుతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అందించిన తాజా గణాంకాల ప్రకారం.. గత జనవరి నెలలో డిజిటల్ గోల్డ్ విక్రయాలు రికార్డు స్థాయిలో రూ. 3,926 కోట్లకు చేరాయి. దాదాపు 21.9 కోట్ల లావాదేవీలు కేవలం యూపీఐ (UPI) ద్వారానే జరగడం విశేషం.

యూపీఐ ద్వారా పెరిగిన జోరు
గతేడాది జనవరిలో కేవలం రూ. 762 కోట్లుగా ఉన్న అమ్మకాలు, ఈ ఏడాది జనవరి నాటికి భారీగా పెరిగాయి. మన దేశంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ గోల్డ్ అమ్మకాల్లో 90 శాతానికి పైగా ఎన్‌పీసీఐ (NPCI) నిర్వహించే యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. నవంబర్ నెలలో సెబీ (SEBI) ఈ డిజిటల్ గోల్డ్ నియంత్రణ లేని మార్కెట్ అని హెచ్చరించడంతో అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ డిసెంబర్, జనవరిలో మళ్ళీ పుంజుకున్నాయి.
డిజిటల్ గోల్డ్ ఎందుకు ఇంత పాపులర్?
1. రూపాయికే బంగారం: సాధారణంగా బంగారం కొనాలంటే వేలల్లో కావాలి. కానీ ఫోన్ పే, పేటీఎం, జార్ (Jar), గూగుల్ పే వంటి యాప్స్‌లో కేవలం ఒక్క రూపాయి నుంచి కూడా బంగారం కొనే సదుపాయం ఉంది.
2. సేఫ్టీ & యాక్సెస్: భౌతిక బంగారాన్ని దాచుకునే రిస్క్ లేకుండా.. మొబైల్ నుంచే ఎప్పుడైనా కొనవచ్చు, అమ్మవచ్చు.
3. ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్: చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే అవకాశం ఉండటంతో సామాన్యులు కూడా దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు.
నిపుణుల సలహా.. జాగ్రత్తలు..
జార్ (Jar) కో-ఫౌండర్ నిశ్చయ్ ఏజీ మాట్లాడుతూ.. "భారతీయ కుటుంబాలకు బంగారం ఎప్పుడూ ఒక నమ్మకమైన పొదుపు సాధనం. అయితే స్వల్పకాలిక లాభాల కోసం కాకుండా క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పొదుపుపై దృష్టి పెట్టాలి" అని సూచించారు.
ఇకపోతే డిజిటల్ గోల్డ్ విషయంలో కొన్ని రిస్కులు కూడా ఉన్నాయని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ గోల్డ్ విక్రయించే ప్లాట్‌ఫారమ్‌లు మూతపడితే కస్టమర్ల పరిస్థితి ఏంటనేది ఒక ప్రశ్న. సాధారణంగా ఎంఎంటీసీ-పాంప్ (MMTC-PAMP) లేదా సేఫ్ గోల్డ్ (SafeGold) వంటి సంస్థలు ఈ బంగారాన్ని భద్రపరుస్తాయి. దీనిపై జీఎస్టీ (GST) , స్టోరేజ్ ఛార్జీలు కూడా ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా సెబీ నియంత్రణలో ఉండే గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) లను కూడా ఎంచుకోవచ్చు. అయితే వీటికి డీమ్యాట్ అకౌంట్ అవసరం. కానీ, డిజిటల్ గోల్డ్ కు ఎలాంటి సేఫ్టీ ఉండదు. ఆయా కంపెనీలపై ఉండే నమ్మకం మీద ఆధారపడి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఏదేమైనా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ భారతీయుల పసిడి పెట్టుబడి శైలి మారుతోంది. ఫిజికల్ గోల్డ్ కు బదులుగా ఇప్పుడు చాలామంది గోల్డ్ ఈటీఎఫ్ లేదా డిజిటల్ గోల్డ్ వంటివి ఎక్కువగా కొంటున్నారు. భవిష్యత్తులో ఈ డిజిటల్ గోల్డ్ (Digital Gold) మార్కెట్ మరిన్ని రికార్డులను సృష్టించేలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications