డిజిటల్ బంగారానికి భారీ క్రేజ్.. 2031 నాటికి రూ.లక్షల కోట్ల మార్కెట్.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ షాకింగ్ న్యూస్..
Digital Gold Investment: నగల దుకాణాలకు వెళ్లే పని లేకుండా, నాణేలు, బిస్కట్లను భౌతికంగా ఇళ్లకు తీసుకురాకుండా, లాకర్ల భద్రత గురించి అస్సలు చింతించకుండా బంగారం కొనుగోలు చేసే ఆధునిక విధానం డిజిటల్ విపణిలో వేగంగా పుంజుకుంటోంది.
మొబైల్ యాప్ తెరచి కావలసిన మొత్తాన్ని ఎంటర్ చేస్తే చాలు, మీ పేరు మీద డిజిటల్ రూపంలో బంగారం జమ అవుతుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) విడుదల చేసిన ఒక సంయుక్త నివేదిక ప్రకారం.. ఈ నూతన డిజిటల్ ఆలోచన రాబోయే రోజుల్లో అంతర్జాతీయ బంగారు మార్కెట్ స్వరూపాన్నే మార్చబోతోంది.
ప్రస్తుతం డిజిటల్ బంగారు మార్కెట్ విలువ రూ. 4.28 లక్షల కోట్ల నుండి రూ. 5.23 లక్షల కోట్ల మధ్య ఉంది. రాబోయే 2031 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా రూ. 15.2 లక్షల కోట్ల నుండి రూ. 16.15 లక్షల కోట్లకు చేరుకునే అవకాశముందని నివేదిక అంచనా వేసింది. అంటే మార్కెట్ పరిమాణం మూడు రెట్లకు పైగా విస్తరించనుంది. అంతేకాకుండా 2031 నాటికి బంగారు మార్కెట్‌లోకి నూతనంగా రాబోయే పెట్టుబడులు రూ. 9.03 లక్షల కోట్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు.

ఈ నివేదికలోని అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసేవారంతా పాత బంగారం ఇన్వెస్టర్లు కాదు. ఇప్పటివరకు బంగారంలో అసలు రూపంలో పెట్టుబడి పెట్టని వారి నుంచే దాదాపు 65 శాతం డిమాండ్ రానుందని WGC విశ్లేషించింది. ఇంతకుముందు ఎప్పుడూ భౌతిక పసిడి కొనుగోలు చేయని కొత్త తరం పెట్టుబడిదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా చిన్న మొత్తాలతో ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు.
డిజిటల్ గోల్డ్ విధానంలో యాప్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కొనుగోలు చేసిన మొత్తానికి సమానమైన అసలు భౌతిక బంగారాన్ని సురక్షితమైన ఖజానా (Vaults) లో భద్రపరుస్తారు. వినియోగదారులకు డిజిటల్ ఎంట్రీ లభిస్తుంది.
ప్రస్తుతం భౌతిక మార్కెట్‌తో పోలిస్తే టోకెనైజ్డ్ బంగారం వాటా 1 శాతం కంటే తక్కువే ఉన్నప్పటికీ.. 2026 మొదటి త్రైమాసికం నాటికి టోకెనైజ్డ్ బంగారం స్పాట్ ట్రేడింగ్ పరిమాణం రూ. 8.55 లక్షల కోట్లను దాటనుండటం దీని క్రేజ్‌ను తెలియజేస్తోంది. WGC సర్వే ప్రకారం.. డిజిటల్ బంగారం కొనుగోలు చేసినవారిలో 52 శాతం మంది తమ జీవితంలో మొదటిసారి బంగారాన్ని కొన్నారు. అందులో 92 శాతం మంది ఆ తర్వాత ఇతర రూపాల్లోనూ పసిడిని కొనుగోలు చేయడం విశేషం.
భారతదేశం, చైనా, ఇండోనేషియా వంటి ఆసియా దేశాల్లో సూపర్ యాప్‌లు, పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు, బ్యాంకింగ్ యాప్‌లలో డిజిటల్ బంగారం సులభంగా లభిస్తుండటంతో.. ఇతర మార్కెట్లతో పోలిస్తే దీని విస్తృతి ఏడు రెట్లు ఎక్కువగా ఉంది. 25 నుండి 34 సంవత్సరాల వయస్సు గల జెన్-జీతో పాటుగా యువతలో డిజిటల్ బంగారంపై అవగాహన 50 శాతంగా ఉండగా.. 55 ఏళ్లు దాటిన వారిలో ఇది కేవలం 23 శాతంగానే ఉంది.
దాదాపు 80 శాతం మంది ఇన్వెస్టర్లు ప్లాట్‌ఫారమ్ సురక్షితమైనదా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే అడుగు ముందుకు వేస్తున్నారు. భవిష్యత్తులో డిజిటల్ బంగారాన్ని రుణాల కోసం పూచీకత్తుగా (Collateral) వాడటం లేదా చెల్లింపులకు అనుమతించడం వంటి సౌకర్యాలు వస్తే దీని ప్రాచుర్యం మరింత పెరగనుంది.
అయితే ఈ రంగం ఏటా 27 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించే అవకాశమున్నప్పటికీ, ఇన్వెస్టర్లలో మూడు ప్రధాన సందేహాలు ఇంకా అలానే ఉన్నాయి.
1. కొనుగోలు చేసిన బంగారాన్ని భౌతికంగా ఎంతవరకు సురక్షితంగా నిల్వ చేస్తారు?
2. కొనుగోలు, విక్రయాలు, స్టోరేజ్ రుసుములు (Fees) ఎంతవరకు పారదర్శకంగా ఉంటాయి?
3. అత్యవసర సమయంలో డిజిటల్ బంగారాన్ని నిజమైన ఆభరణాలుగా లేదా నాణేలుగా సులభంగా మార్చుకోవచ్చా?
మొత్తానికి మొబైల్ సౌలభ్యం, కొత్త పెట్టుబడిదారుల ఉత్సాహంతో డిజిటల్ గోల్డ్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. కంపెనీలు భద్రత, సైబర్ రక్షణ, పారదర్శకత విషయంలో నమ్మకాన్ని నిలబెట్టుకున్నప్పుడే ఈ విప్లవం విజయవంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
