IPO News: తొలిరోజే ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన ఐపీవో.. అప్పర్ సర్క్యూట్‌లో లాక్..
IPO News: మార్కెట్లతో మాకు సంబంధం లేదు అన్నట్లుగా నేడు లిస్టింగ్ అయిన ఐపీవో ప్రవర్తించింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలను అందించి తొలిరోజే రికార్డుల మోత మోగించింది.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది డిజికోర్ స్టూడియోస్ లిమిటెడ్ ఐపీవో గురించే. ఈ స్టాక్ నేడు భారీ లాభాలతో మార్కెట్లోకి అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో 57% ప్రీమియం ధర రూ.270 వద్ద జాబితా చేయబడింది. ట్రేడింగ్ ప్రారంభించిన కొద్ది సేపటికే షేరు రూ.283.50 రేటు వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో స్టాక్ ఇష్యూ ధర కంటే 65.79 శాతం లాభాన్ని పెట్టుబడిదారులకు అందించింది.

కంపెనీ ఐపీవో స్టాక్ ప్రైస్ బ్యాండ్ రూ.168-171గా నిర్ణయించింది. ఈ క్రమంలో ఒక్కో లాట్‌లో 800 షేర్ల చొప్పున విక్రయించింది. అంటే ఒక లాట్ కొనుగోలు చేసేందుకు రూ.1,36,800 పెట్టుబడిగా పెట్టారు. షేర్లను పొందిన ఇన్వెస్టర్లు లాటుకు రూ.90,000 లాభంగా తొలిరోజే అందుకోవటంతో సంతోషంగా ఉన్నారు. లిస్టింగ్ ముందర గ్రేమార్కెట్లో సైతం స్టాక్ మంచి పనితీరును కనబరిచింది. IPO పెట్టుబడిదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందటమే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.

ఐపీవో ఓపెన్ అయిన తర్వాత మూడు రోజుల వ్యవధిలో 281.58 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. డిజికోర్ స్టూడియోస్ లిమిటెడ్ తన రూ.30.48 కోట్లను మార్కెట్ల నుంచి సేకరించింది. దీనిని వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించాలని కంపెనీ నిర్ణయించింది. 2000 సంవత్సరంలో ప్రారంభమైన కంపెనీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, యాడ్స్ కోసం విజువల్ ఎఫెక్ట్స్(VFX) సేవలను అందిస్తూ ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపును పొందింది.
డిజికోర్ స్టూడియోస్ ప్రఖ్యాత డిస్నీ/మార్వెల్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఆపిల్, పారామౌంట్, వార్నర్బ్రదర్స్, లయన్స్ గేట్ వంటి కంపెనీల ప్రాజెక్ట్‌ల కోసం పనిచేసింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.1,186.49 లక్షలుగా ఉండగా.. రూ.270.89 లక్షల లాభాన్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications