Layoffs News: వేలాది మంది ఉద్యోగులపై 'డెల్' వేటు.. మాంద్యం భయాలు కాదు ఇదీ రీజన్..
Dell fresh layoffs: ప్రపంచం ఎంతగా ముందుకు దూసుకుపోతున్నా ఆర్థిక మాంద్యం భయాలు పలు దేశాలు మరియు కంపెనీలను వణికిస్తూనే ఉంది. దీనికి చక్కటి ఉదాహరణే నిన్నగాక మొన్న మార్కెట్ల భారీ పతనం. ఈ పరిస్థితుల్లో దిగ్గజ IT కంపెనీలు కూడా తమ మార్జిన్లను కాపాడుకునేందుకు ఉద్యోగులపై వేటు వేయక తప్పడం లేదు. అయితే కొన్ని సంస్థలు మాత్రం మనుగడ కోసం కాకుండా AI వంటి ఇతర టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టడం కోసం సిబ్బందిని బాధితులుగా మారుస్తున్నాయి.
కంప్యూటర్ మ్యాన్యుఫ్యాక్ఛర్ దిగ్గజం డెల్ తన సేల్స్ విభాగంలో తాజాగా లేఆఫ్స్ ప్రకటించింది. ఈ విధంగా సేవ్ చేసిన నిధులను ఆధునీకరణ సహా కృత్రిమ మేధస్సుపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. AI విషయంలో భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సేల్స్ టీమ్‌లను ఏకీకృతం చేయడంతో పాటు కొత్త AI ఫోకస్డ్ యూనిట్‌ను రూపొందించాలని కంపెనీ భావిస్తున్నట్లు ఆగస్టు 6న తన అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలియజేసింది. అనంతరం ఈ మేరకు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

లేఫ్స్ వల్ల ప్రభావితం కాబడిన ఉద్యోగుల సంఖ్య అధికారికంగా నిర్ధారించబడలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం సుమారు 12 వేల 500 మంది బాధితులుగా మారినట్లు సమాచారం. అంటే డెల్ శ్రామికశక్తిలో 10 శాతం మంది దీని వల్ల బాధించబడతారని అంచనా. తొలగింపులు ప్రధానంగా మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్‌లపై ప్రభావం చూపగా.. వారిలో కొంతమంది కంపెనీలో 2 దశాబ్దాలకుపైగా అనుభవం ఉన్నవారు కావడం గమనార్హం.
ఫిబ్రవరి 2023 నుంచి దాదాపు లక్షా 30 వేల మంది వరకు ఉద్యోగులను డెల్ తొలగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు సిబ్బంది తమ ఉద్యోగాలపై అభద్రతా భావంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. దీనితో పాటు వృద్ధి అవకాశాలు కూడా పరిమితంగానే ఉన్నాయని చెప్పినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. ఎందుకంటే దాదాపు ప్రతి 6 నెలలకు ఒకసారి తాము లేఆఫ్స్ చూస్తున్నట్లు ఓ ఉద్యోగి చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications