Viral Video: ఎక్కువగా సంపాదించే వారు అంటే ఠక్కున సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అని చెప్పేస్తారు. కానీ వారిని మించి ఆర్జించేవారు కూడా ఉన్నారు. సోషల్ మీడియా, స్టార్టప్స్ కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చిన ప్రస్తుత రోజుల్లో.. ఉన్నత చదువులు లేనప్పటికీ అనేకమంది కెరీర్‌లో బాగా సెటిల్ అవుతున్నారు. కేవలం చేతిలో మొబైల్, బైక్ వంటి రోజువారీ వినియోగ వస్తువుల ఆధారంగా 6 అంకెల్లో ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు.
లవీనా కామత్ అనే యూట్యూబర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా బెంగళూరులో పనిచేస్తున్న స్విగ్గీ మరియు జొమాటో డెలివరీ ఏజెంట్ల ఆదాయాలపై మాట్లాడారు. దేశంలోని చాలా మంది IT ఇంజనీర్‌ల కంటే వారి రాబడి అధికమని వెల్లడించారు. 'ఫుల్ డిస్‌క్లోజర్' అనే తన ఛానెల్‌లో ఇద్దరు డెలివరీ ఏజెంట్‌లతో ఈ విషయంపై చర్చించారు. సగటు IT నిపుణుల ఆదాయాలను వారితో పోల్చి చూపారు.

నెలకు సగటున 20 వేలు ఆర్జించే సాధారణ IT ఇంజనీర్ల కంటే సదరు డెలివరీ ఏజెంట్ల సంపాదన రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్లు కామత్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 22 ఏళ్లు కలిగిన వారిద్దరూ నెలకు 40 నుంచి 50 వేల వరకు ఆర్జిస్తున్నట్లు వారు తెలిపారు. ఆర్డర్‌కు 20 బేస్ పే కాగా అదనపు ప్రోత్సాహకాలతో దాదాపు 5 వేల వరకు పొందుతున్నట్లు వెల్లడించారు.
మూడేళ్లుగా డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారిలో ఒకరు గత 6 నెలలుగా 2 లక్షలు సేవ్ చేసినట్లు చెప్పారు. తన గ్రామంలో సొంత వ్యాపారం ప్రారంభించేందుకు ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టాలని చూస్తున్నట్లు తెలిపారు. వారి ఆదాయాలు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, చాలా మంది ఈ పనిని దీర్ఘకాలిక కెరీర్‌గా కాకుండా తాత్కాలిక చర్యగా చూస్తున్నట్లు కామత్ వివరించారు.
ఇదికాస్తా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వారి ఆదాయాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు కొందరుండగా, మరికొందరు IT ఉద్యోగాలతో పోలిస్తే డెలివరీ పని డిమాండ్ మరియు స్వభావాన్ని ఎత్తి చూపారు. ఇంజనీర్ వేతనం ప్రారంభంలో తక్కువే కావచ్చు కానీ కెరీర్‌లో మంచి వృద్ధి ఉంటుందని, కానీ డెలివరీ ఏజెంట్ విషయంలో అలా కాదని ఓ యూజర్ కామెంట్ చేశారు. కాబట్టి IT ఇంజనీర్‌ని డెలివరీ ఏజెంట్‌తో పోల్చి చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications