World's Polluted City: భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి వాయు కాలుష్యం. దీనితో పాటు గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి 'నెట్ జీరో కార్బన్ ఎమిషన్' దిశగా అడుగులు వేస్తోంది. సాంప్రదాయ డీజిల్, పెట్రోల్ కు బదులు ఎలక్ట్రిక్, గ్యాస్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. కానీ ఇప్పటికీ కొన్ని విషయాల్లో తీవ్ర అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ ఓ అధ్యయనం జరిపింది. 'ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్' పేరిట పరిశోధనా వివరాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. ఇందులో మన దేశానికి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.

యావత్ ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుత స్థాయి గనుక కొనసాగినట్లయితే అక్కడ నివసించే ప్రజల ఆయుర్దాయం దాదాపు 12 ఏళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఇదేకాక అత్యంత తక్కువ కాలుష్యం నమోదైన పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లాలో కూడా పొల్యూషన్ ప్రమాదకర స్థాయిలోనే ఉన్నట్లు తెలిపింది.
ఈ భారీ కాలుష్యానికి భౌగోళిక అంశాలతో పాటు మానవ తప్పిదాలూ కారణమేనని నివేదిక భావిస్తోంది. వాహనాలు, వ్యవసాయం, నివాస ప్రాంతాలు వల్ల కాలుష్యం నానాటికీ పెరిగిపోతోందని తెలిపింది. మనతో పాటు పొరుగునున్న బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇండోనేషియాలు కూడా పొల్యూషన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఇక్కడ నివసించే ప్రజలు దాదాపు 6 ఏళ్లకు పైగా జీవితకాలాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications