Power Bill Scam: కరెంట్ బిల్లులు కట్టాలంటూ మోసం.. నమ్మారో బ్యాంకు ఖాతా ఖాళీ..! జాగ్రత్త..
Power Bill Scam: రోజుకో రకం మోసాలు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా కరెంట్ బిల్లులు వీటికి అడ్డాగా మారాయి. ఇలా వంద మందికి పైగా మోసపోయినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. పెండింగ్ బిల్ చెల్లిస్తామంటూ ఎలా మోసాలు చేస్తున్నారు. వారికి మన ఫోన్ నంబర్లు ఎలా వెళుతున్నాయనే వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

నిందుతుల అరెస్ట్
కరెంటు బిల్లుల పేరున మోసాలకు పాల్పడుతున్న 65 మందిని ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్ అరెస్ట్ చేసింది. వీరిని 22 నగరాల నుంచి అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు సంబంధించిన 100 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ఇప్పటి వరకు కోటి రూపాయలు ప్రజల నుంచి మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరిని ఎంపీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నారు.

ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు..?
సిండికేట్ గా ఏర్పడిన ముఠా.. జార్ఖండ్‌లోని జమ్తారా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు ఇతర నగరాల నుంచి దీనిని ఆపరేట్ చేస్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడటంలో జమ్తారా చాలా ప్రసిద్ధి అని పోలీసులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,000 ఫిర్యాదులు అందాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

నకిలీ సిమ్‌కార్డుల వినియోగం..
లాజిస్టిక్ ప్రొవైడర్లు, టెలికాలర్లు, బ్యాంక్ అధికారులు, సిమ్ కార్డ్ విక్రేతలు, ఈ-మిత్ర వ్యక్తులు వంటి స్కామ్‌స్టర్‌లతో అనేక మాడ్యూల్స్ కలిసి పనిచేస్తాయని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. వ్యక్తిగత వివరాలను దొంగిలించడానికి సంబంధిత కంపెనీలకు తెలియకుండానే నిందితులు నకిలీ సిమ్‌కార్డులను ఉపయోగిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వీటిని అడ్డుకునేందుకు టెలికమ్యూనికేషన్స్ అధికారులు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

కరెంట్ బిల్ పెండింగ్..
కరెంట్ బిల్ చెల్లించలేదంటూ నిందితులు వినియోగదారులకు వాట్సాప్, ఎస్ఎమ్ఎస్ లింక్స్ పంపుతున్నారు. బిల్లు వెంటనే చెల్లించకపోతే ఈ రోజు రాత్రికే కరెంట్ సరఫరా నిలిపివేయబడుతుందంటూ అందులో హెచ్చరిక ఉంటుంది. వెంటనే బిల్ చెల్లించేందుకు వారు ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చెల్లింపు చేయాలని సూచిస్తారు. ఇది నిజమేనని నమ్మి లింక్ క్లిక్ చేసినప్పుడు టెలికాలర్ వ్యవస్థకు కనెక్ట్ చేయబడతారు. టెలికాలర్లు తరచూ BSES అధికారులుగా నటిస్తూ బ్యాంకు ఖాతా వివరాలను అడుగుతారు. అలా కాజేసిన డబ్బును రిమోట్ యాక్సెస్ సాఫ్ట్‌వేర్ ద్వారా బాధితుడి ఖాతా నుంచి మొత్తాన్ని నకిలీ ఖాతాలకు బదిలీ చేస్తారు.

స్థావరాలను మార్చుతూ మోసాలు..
మోసానికి ఉపయోగించిన చాలా ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తరచూ రహస్య స్థావరాలను మారుస్తుండటంతో వాటిని మళ్లీ ఇతర ప్రదేశాల్లో ఆన్ చేసేవారని డీసీపీ మల్హోత్రా తెలిపారు. కస్టమర్ల రూపంలో ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నట్లు సైబర్ పోలీసులు తెలిపారు. ఇలాంటి అపరిచిత లింక్స్ క్లిక్ చేయవద్దని, మోసపూరిత మెసేజ్ లకు స్పందించకుండా జాగ్రతపడాలని పోలీసులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications