Financial Fraud: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతామంటూ పూజారికి శఠగోపం.. రూ.3.32 కోట్లు స్వాహా చేసిన నిందితుల
Investment Fraud: ఈ రోజుల్లో చాలా మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి తక్కువ కాలంలోనే ఎక్కువ సంపాదించాలని చూస్తున్నారు. ఈ ఆలోచనా దోరణి కొత్త రకం మోసాలకు కారణంగా నిలుస్తోంది. కొంత మంది నిందితులు స్టాక్ మార్కెట్లలో తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెడతామని.. మీరు కేవలం డబ్బు పెట్టుబడిగా పెడితే సరిపోతుందంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఇప్పుడు రాజస్థాన్ లో చోటుచేసుకుంది. అయితే బయటకు రాని మరెన్ని ఇలాంటి మోసాలు ప్రస్తుతం దేశంలో జరుగుతున్నాయి.

పూజారిని మోసం చేసిన నిందితులు..
ఆలయ పూజారిని రూ.3.32 కోట్ల మేర మోసం చేసిన దుండగుడిని ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడు రాజస్థాన్‌లోని ఖతుష్యం ఆలయ పూజారిని, అతని బంధువులను మోసం చేశాడు. ఈ మొత్తం డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టి పెద్ద లాభాలు తెచ్చిపెడతానని నిందుతులు మోసానికి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. చాలా కాలంగా నిందుతులు డబ్బును తిరిగి చెల్లించకపోవటంతో సదరు పూజారి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

లాభాల ఆశ చూపి..
మోసం చేసిన నిందితుడు మనీష్ బోహ్రా, అతని సహచరులు స్టాక్ మార్కెట్ వ్యాపారులని పోలీసులు తెలిపారు. వివిధ పెద్ద కంపెనీల ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే చాలా లాభం వస్తుందని ఆలయ పూజారికి, బంధువులకు హామీ ఇచ్చారు. తక్కువ కాలంలోనే పెట్టుబడిగా పెట్టిన డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మబలికారు. అతని మాటలను నమ్మిన పూజారి, అతని బంధువులు దాదాపు రూ.3.32 కోట్లను పెట్టుబడుల కోసం నిందితులకు ఇచ్చారు.

షేర్లు కొన్నామని..
మనీష్ బోహ్రా బాధితులకు.. పెట్టుబడిగా అందించిన డబ్బుతో చాలా షేర్లు కొన్నట్లు ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపాడు. అయితే.. నిందితులు రూ.3 కోట్ల షేర్ల పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి రశీదు గానీ, ఇతర ఆధారాలు గానీ బాధితులకు ఇవ్వలేదు. అనుమానం వచ్చిన సదరు పూజారి చిన్న విచారణ జరిపగా.. అతని డబ్బుతో అసలు ఎటువంటి షేర్లు కొనలేదని తేలింది. దీంతో ఈ వ్యవహారం పోలీసుల ముందుకు వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన మనీష్ బోహ్రాను అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అత్యాసకు పోయి ఇలాంటి వారి చేతుల్లో చిక్కుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications