కియాపై కేంద్రానికి కంప్లైట్: రిజిస్ట్రేషన్ రద్దు కోసం: ఆ మూడింటిపైనా
న్యూఢిల్లీ: కాశ్మీర్ అంశంపై వివాదాస్పద పోస్టులు పెట్టిన నాలుగు కార్పొరేట్ కంపెనీల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి చేరింది.. లీగల్‌గా. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఆ నాలుగు కంపెనీలు కూడా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని వివాదాస్పదం చేశాయని, వాటికి కేటాయించిన రిజిస్ట్రేషన్, వ్యాపారపరమైన లైసెన్సులను రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- ఈ అంశం కేంద్రం దృష్టికి చేరింది. ఢిల్లీ పోలీసులకూ ఫిర్యాదులు అందాయి.
ఆ నాలుగు కంపెనీలు.. కియా, హ్యుండాయ్, పిజ్జాహట్, కేఎఫ్‌సీ. ఢిల్లీకి చెందిన వినీత్ జిందాల్ అనే న్యాయవాది ఈ నాలుగు కంపెనీలపై ఫిర్యాదు చేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే కార్పొరేట్ వ్యవహారాల విభాగంతో పాటు ఢిల్లీ పోలీసుల వద్ద ఈ నాలుగు కంపెనీలపై ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ, ఐటీ యాక్ట్‌లోని 121 ఏ, 153, 153 ఏ, 504, 505 కింద కేసు నమోదు అయ్యాయి.

తమ వ్యాపార కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడం, లాభాలను ఆర్జించడంలో భాగంగా ఈ నాలుగు కంపెనీలు పాకిస్తాన్‌లో కాశ్మీర్‌కు అనుకూలంగా ప్రకటనలు చేశాయి. జమ్మూ కాశ్మీర్ అంశం అత్యంత సున్నితమైనదని, దీన్ని వ్యాపారపరంగా మార్చుకోవడానికి ప్రయత్నించాయని వినీత్ జైన్ ఆరోపించారు. కోట్లాదిమంది భారతీయుల మనోభావాలతో ముడిపడి ఉన్న కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌లో అనుకూలంగా కామెంట్స్ చేయడంలో అర్థం లేదని అన్నారు.
హ్యుండాయ్, కియా, పిజ్జాహట్, కేఎఫ్‌సీ ఈ పోస్ట్ చేసిన తరువాత భారత్‌లో వాటిపై తీవ్ర వ్యతిరేకత చెలరేగింది. ఈ నాలుగు కంపెనీలను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు. బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను హోరెత్తించారు. దీనితో ఆయా కంపెనీలు దిగొచ్చాయి. భారతీయులకు క్షమాపణలు చెప్పాయి. జాతీయవాదాన్ని గౌరవించే భారతీయుల బలమైన ఆకాంక్షలను తాము గౌరవిస్తున్నామని పేర్కొన్నాయి.
అనేక సంవత్సరాలుగా భారతీయులతో తమకు స్నేహ సంబంధాలు, ఉన్నాయని, వారి మనోభావాలు దెబ్బతీసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అది తప్పు అవుతుందని పేర్కొంది. పాకిస్తాన్ విభాగం చేసిన ఆయా ట్వీట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ- దీనిపై దుమారం తగ్గలేదు. తాజాగా న్యాయవాది వినీత్ జైన్.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


Click it and Unblock the Notifications