Viral News: ధోనీపై పరువునష్టం దావా.. ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం నమోదు.. విషయం ఏంటంటే..
Dhoni News: భారతీయ క్రీడా రంగంలో క్రికెట్‌కు ఉన్న ప్రాధాన్యత ఏ ఆటకు లేదని చెప్పవచ్చు. దిగ్గజ క్రికెటర్లలో ఒకరిగా, ఇండియన్ టీమ్ మాజీ సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ తనదైన ముద్ర వేశారు. కేవలం ఓ ఆటగాడిగానే కాకుండా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అంతటి గొప్ప వ్యక్తిపై తాజాగా ఓ కేసు నమోదైంది.
ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ MS ధోనీకి వ్యతిరేకంగా ఇద్దరు మాజీ వ్యాపార భాగస్వాములు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు మీడియా నివేదికలు వెలువడ్డాయి. మిహిర్ దివాకర్ మరియు అతని భార్య సౌమ్య ఈ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో తనను 15 కోట్లకు పైగా మోసం చేసినందుకు ధోని వారిద్దరిపై క్రిమినల్ కేసు పెట్టారు.

ధోనీ సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు మీడియా సంస్థలపై తమ విషయంలో శాశ్వత నిషేధం విధించాలని కోరుతూ వారివురూ హైకోర్టును ఆశ్రయించారు. తమ పరువుకు భంగం కలిగిందంటూ నష్టపరిహారం కోరారు. వారికి వ్యతిరేకంగా, పరువు నష్టం కలిగించే హానికరమైన ప్రకటనలు, ప్రసారాలు జరగకుండా నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా దాఖలైన ఈ పరువు నష్టం దావా జనవరి 18న జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
'దివాకర్, సౌమ్య విశ్వాస్‌లు.. స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ 'ఆర్కా స్పోర్ట్స్' డైరెక్టర్లుగా ఉన్నారు. భారత్‌తోపాటు విదేశాల్లో ధోనీ పేరిట క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయాలని 2017లో ఆయన్ను సంప్రదించారు. ఒప్పందం ప్రకారం పూర్తి ఫ్రాంచైజీ రుసుముతో పాటు లాభాలనూ 70:30 ప్రాతిపదికన పంచుకోవాలి. వారు ధోనీకి తెలియకుండా అకాడమీలను ఏర్పాటు చేసి, ఎటువంటి చెల్లింపులు చేయలేదు. రెండుసార్లు లీగల్ నోటీసులు అందించినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాం' అని క్రికెటర్ తరపు న్యాయవాది దయానంద్ సింగ్ తెలిపారు.


Click it and Unblock the Notifications