పాత ఉద్యోగులంతా వెనక్కి రండి: దీపిందర్ గోయల్ పిలుపుకు భారీ రెస్పాన్స్.. అసలు ఏం జరిగిందంటే?
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ 'జోమాటో' (Zomato) వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. తన కంపెనీ (Eternal) కోసం గతంలో పనిచేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులను మళ్ళీ ఆహ్వానిస్తూ ఆయన ఒక మెయిల్ ఐడిని షేర్ చేశారు. అయితే దానికి వచ్చిన స్పందన చూసి ఆయన స్వయంగా ఆశ్చర్యపోయారు. కేవలం వారం రోజుల్లోనే ఆయనకు ఏకంగా 8,000 ఈమెయిల్స్ వచ్చాయట!

అనూహ్యమైన స్పందన.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీమ్
దీపిందర్ గోయల్ తన 'X' (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈ 8,000 మెయిల్స్‌లో సుమారు 4,000 మంది మాజీ ఉద్యోగులు ఉండగా మిగిలిన 4,000 మంది కొత్తగా చేరాలనుకునే వారు ఉన్నారు. వచ్చిన మెయిల్స్ అన్నీ కూడా చాలా ఎమోషనల్‌గా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ఎదుగుతున్న రోజుల్లో వారు పడ్డ కష్టాలు, నాటి మధుర స్మృతులను వివరిస్తూ చాలామంది సుదీర్ఘమైన ఈమెయిల్స్ రాశారు. ఈ మెయిల్స్‌లో ఉన్న లోతైన విషయాలు ప్రస్తుత హెచ్ఆర్ టీమ్స్ అర్థం చేసుకోవడం కష్టమని, అందుకే స్వయంగా తానే వాటిని చదవాల్సి వస్తోందని దీపిందర్ తెలిపారు.
"నా నంబర్ వెతికి పట్టుకోండి.. వాట్సాప్ చేయండి!"
ఇన్ని వేల ఈమెయిల్స్ ఒక్కడే చదవడం మనిషిగా సాధ్యం కాదని దీపిందర్ గోయల్ ఒప్పుకున్నారు. అందుకే తనతో నేరుగా పనిచేసిన వారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. "మీరు నాతో గతంలో నేరుగా కలిసి పనిచేసి ఉంటే మెయిల్ రిప్లై కోసం ఎదురుచూడకండి. ఎలాగైనా నా ఫోన్ నంబర్ వెతికి పట్టుకుని, నాకు నేరుగా వాట్సాప్ చేయండి. త్వరగా స్పందిస్తాను" అని ఆయన ప్రకటించారు. ఒక దిగ్గజ కంపెనీ ఫౌండర్ ఇలా ఓపెన్‌గా తన నంబర్ వెతికి మెసేజ్ చేయమని చెప్పడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్పందనలు
దీపిందర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు సరదాగా.. "మీ నంబర్ ఎక్కడ దొరుకుతుందో కూడా మీరే చెప్పేయండి సార్" అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు దీపిందర్ గోయల్ పారదర్శకతను మెచ్చుకుంటున్నారు. ఒక కంపెనీ తన పాత ఉద్యోగులను గౌరవించడం, వారి అనుభవాన్ని మళ్ళీ వాడుకోవాలనుకోవడం గొప్ప విషయమని వ్యాపార దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ , స్టార్టప్ రంగాల్లో లేఆఫ్స్ నడుస్తున్న ఈ సమయంలో గోయల్ తన పాత టీమ్‌ను మళ్ళీ వెనక్కి పిలవడం అనేది ఇండస్ట్రీలో ఒక సానుకూల సంకేతాన్ని ఇస్తోంది. అయితే ఆ 8,000 మందిలో ఎవరికి మళ్ళీ అవకాశం దక్కుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications