డెబిట్ కార్డులు భారీగా తగ్గాయి... అందుకు కారణాలు ఏమిటంటే?
దేశీయ బ్యాంకింగ్ రంగంలో డెబిట్ కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు భారత రిజర్వ్ బ్యాంకు వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇందుకు గల కారణాలను కూడా పేర్కొంది. ఈ ఏడాదిలో డెబిట్ కార్డుల సంఖ్య 15 శాతం మేర తగ్గింది. దీంతో గత ఏడాదిలో 99.8 కోట్లున్న కార్డుల సంఖ్య ఈ ఏడాదిలో 84.3 కోట్లకు తగ్గిపోయింది. ప్రస్తుతం కార్డుల సంఖ్య రెండేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది.

వినియోగంలో లేనివి....
మాగ్నెటిక్ కార్డుల నుంచి సురక్షితమైన చిప్ కార్డులకు ఆర్బీఐ ఆదేశాల మేరకు మారిపోవడం వల్ల కార్డుల సంఖ్య తగ్గినట్టుగా బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే మార్కెట్ నుంచి 15.5 కోట్ల కార్డులు వినియోగంలో లేకుండా పోయినట్టుగా చెబుతున్నారు. ఆర్బీఐ నూతన ఆదేశాల మేరకు బ్యాంకులు కొత్త కార్డులను జారీ చేస్తున్నాయి. వినియోగంలో లేని ఖాతాదారులకు కార్డులను జారీ చేయడం లేదు. చిప్ ఆధారిత కార్డులను తీసుకోవాలని బ్యాంకులు తమ ఖాతాదారులకు తెలియజేస్తున్నాయి.
అయినప్పటికీ ఇంకా కొత్తకార్డులు తీసుకొని కస్టమర్లు చాలా మంది ఉన్నట్టు సమాచారం.

ఎన్ఎఫ్ సి కార్డులను జారీ
ఇప్పుడు బ్యాంకులు కొత్తగా ఎన్ఎఫ్ సి కార్డులను జారీ చేస్తున్నాయి. వీటినే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఆధారిత లేదా కాంటాక్ట్ లెస్ కార్డులు అని కూడా అంటారు. ఈ కార్డుల ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. పిన్ నెంబర్ను ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.
కార్డులు ఉంటే సాధారణంగా ఏ టీ ఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు లేదా వ్యాపారుల వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ల వద్ద వినియోగిస్తుంటారు. అయితే ఈ వినియోగం ఇప్పుడు తగ్గుతున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. యూపీఐ తో పాటు ఇతర డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫామ్ ఆధారిత యాప్ లతో చెల్లింపులు పెరుగుతున్నాయి. మరోవైపు బ్యాంకులు తమ కస్టమర్ల కార్డ్ కావాలని కొరితేనే కార్డులు ఇస్తున్నాయి. తమకు తాముగా కార్డులను పంపించడం లేదు. వినియోగంలో లేని ఖాతాలకు కూడా డెబిట్ కార్డులు జారీ చేయడం లేదు. దీని వల్ల బ్యాంకులకు కొంత సొమ్ము ఆదా అవుతోంది. నిర్వహణ లేని ఖాతాల్లో పట్టణాల్లోని ఉద్యోగుల ఖాతాలే ఎక్కువ ఉంటున్నాయి. వీరు తరచూ ఉద్యోగాలు మారుతుండటం వల్ల పాత ఖాతాలు వినియోగంలో లేకుండా పోతున్నాయి.

రూపే కార్డుల జోరు
* ప్రజలు ఉచితంగానే జన్ ధన్ ఖాతాలు తెరిచే సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ ఖాతాలు తెరిచిన వారికి రూపే కార్డులను జారీ చేస్తున్నారు. వీటి వినియోగం కూడా ఎక్కువే ఉంటుంది.
*ఈ ఏడాది నవంబర్ నాటికి రూపే కార్డులు గత ఏడాది ఇదే కాలం తో పోల్చితే 13.5 శాతం పెరిగి 29.68 కోట్లకు చేరుకున్నాయి.
* గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల వద్ద కార్డులు 75 శాతం ఉంటే ఏడాదిలో 80 శాతానికి చేరుకున్నట్టుగా గణాంకాల ద్వారా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications