ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! 25% డిస్కౌంట్‌తో సొంత ఇల్లు.. ఇప్పుడే అప్లై చేసుకోండి!
ఈ రోజుల్లో ఆకాశాన్ని అంటుతున్న రియల్ ఎస్టేట్ ధరల వల్ల.. కేవలం సామాన్యులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సొంత ఇల్లు కొనడం అనేది ఒక కలగానే మిగిలిపోతోంది. మార్కెట్ రేట్లకు పోటీ పడి ఇళ్లు కొనలేక చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికి ఊరటనిస్తూ, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) ఒక అద్భుతమైన పథకాన్ని ముందుకు తెచ్చింది. అదే 'కర్మయోగి ఆవాస్ యోజన 2025' (Karmayogi Awaas Yojana 2025).
ఏమిటీ కర్మయోగి ఆవాస్ యోజన?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ సిబ్బందికి తక్కువ ధరకే నివాస వసతి కల్పించాలనే లక్ష్యంతో DDA ఈ పథకాన్ని ప్రారంభించింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (PSUs), ప్రభుత్వ బ్యాంకులు, లోకల్ బాడీస్, స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఢిల్లీలోని నరేలా (Narela) సబ్-సిటీలో సిద్ధంగా ఉన్న 1,168 ఫ్లాట్లను ఈ స్కీమ్ కింద విక్రయించనున్నారు.

భారీ డిస్కౌంట్.. అందుబాటులో ధరలు!
ఈ పథకంలోని అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏంటంటే.. మార్కెట్ ధరతో పోలిస్తే ఏకంగా 25 శాతం డిస్కౌంట్ అందించడం. 1BHK, 2BHK మరియు 3BHK లగ్జరీ ఫ్లాట్లపై ఈ రాయితీ వర్తిస్తుంది. 1 BHK ఫ్లాట్.. సుమారు రూ. 34 లక్షలు, 2 BHK ఫ్లాట్ రూ. 80 లక్షలు, 3 BHK ఫ్లాట్ రూ. 1.15 కోట్ల నుండి ధరలు ప్రారంభమవుతాయి. ప్రైవేట్ బిల్డర్ల దగ్గర కోట్లలో పలికే ధరల కంటే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు, ప్రతి ఫ్లాట్‌కు కేటాయించిన పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది.
ఎవరు అర్హులు? నిబంధనలు ఏమిటి?
సాధారణంగా ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌లలో "ఢిల్లీలో సొంత ఇల్లు ఉంటే అప్లై చేయకూడదు" అనే నిబంధన ఉంటుంది. కానీ ఈ కర్మయోగి ఆవాస్ యోజన 2025 లో అలాంటి ఆంక్షలు లేవు. భారతదేశంలో ఎక్కడైనా మీకు సొంత ఇల్లు లేదా ప్లాట్ ఉన్నప్పటికీ, మీరు ఈ ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఫ్లాట్లను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దరఖాస్తుదారుడికి 18 ఏళ్లు నిండి ఉండాలి మరియు ప్రభుత్వ ఉద్యోగి (సర్వీస్ లేదా రిటైర్డ్) అయి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
ఈ స్కీమ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 19, 2025 నుండి ప్రారంభం కానున్నాయి. ఆసక్తి ఉన్నవారు DDA అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. బుకింగ్ ప్రక్రియ జనవరి 14, 2026 నుండి "మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత" (First-Come-First-Serve) ప్రాతిపదికన జరుగుతుంది. ఈ స్కీమ్ మార్చి 31, 2026తో ముగుస్తుంది.
ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి స్కీమ్స్ వస్తాయా?
ప్రస్తుతానికి ఇది ఢిల్లీలో ఉన్నప్పటికీ.. ఇలాంటి ప్రయోజనకరమైన పథకాలను తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ప్రవేశపెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పెరుగుతున్న ఇంటి అద్దెల భారం నుండి ఉద్యోగులను కాపాడాలంటే ప్రభుత్వమే ఇలాంటి కాలనీలను అభివృద్ధి చేయడం ఉత్తమం.
మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే, ఢిల్లీ వంటి ప్రధాన నగరంలో సొంత ఇల్లు కావాలనుకుంటే.. ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు!


Click it and Unblock the Notifications