Women Financials: ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ వస్తోంది. పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. మనీ మేనేజ్ చేయడంలో మాత్రం పురుషులతో పోలిస్తే ఒక అడుగు ముందే ఉంటున్నారు. తాజాగా వర్కింగ్ ఉమెన్ మీద జరిపిన ఓ అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది.
పట్టణాల్లోని భారతీయ మహిళలు తమ నగదు వినియోగాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు, వారి ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి అనే వ్యవహారంపై తాజాగా ఓ సర్వే జరిగింది. DBS బ్యాంక్ ఇండియా మరియు CRISIL కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. జీతం లేదా స్వయం ఉపాధి ద్వారా సంపాదిస్తున్న వారిలో 98 శాతం మహిళలు దీర్ఘకాలిక కుటుంబ డెసిషన్ మేకింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నట్లు గుర్తించారు.

'ఉమెన్ అండ్ ఫైనాన్స్' పేరిట ఓ నివేదిక తాజాగా విడుదలైంది. దేశంలోని 10 నగరాల్లో 800 మందికి పైగా మహిళలపై ఈ సర్వే నిర్వహించారు. ఆర్థిక నిర్ణయాధికారం, లక్ష్యాలను నిర్దేశించడం, పొదుపు మరియు పెట్టుబడి విధానాలు, డిజిటల్ సాధనాల స్వీకరణ మరియు వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తుల పట్ల వారి ప్రాధాన్యతలతో సహా అనేక విషయాలపై వారి అభిప్రాయాలను నమోదు చేశారు.
వయస్సు, ఆదాయం, వైవాహిక స్థితి, ఆధారపడిన వారు, నివాస ప్రాంతం వంటి అంశాలు మహిళల ఆర్థిక ప్రవర్తనపై ప్రధాన ప్రభావం చూపుతాయని సర్వే ఫలితాలు సూచించాయి. 47 శాతం మంది స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారని వెల్లడైంది. మెట్రో నగరాల్లోని మహిళల పెట్టుబడుల్లో 51 శాతం ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) మరియు పొదుపు ఖాతాల్లో ఉన్నాయి. అనంతరం బంగారంలో 16 శాతం, మ్యూచువల్ ఫండ్‌లలో 15 శాతం, రియల్ ఎస్టేట్‌లో 10 మరియు స్టాక్స్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నారు.
క్రెడిట్ కార్డ్ వినియోగంలో హైదరాబాద్ మరియు ముంబై మహిళలు ముందంజలో ఉన్నారు. ముంబైలో 96 శాతం మంది మహిళలు క్రెడిట్ కార్డ్‌లపై ఆధారపడుతుండగా.. కోల్‌కతాలో 63 శాతం వాటిని ఉపయోగిస్తున్నారు. జీతం పొందుతున్న మహిళల్లో సగం మంది తాము ఎప్పుడూ రుణం తీసుకోలేదని పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. లోన్ తీసుకున్న వారిలో ఎక్కువగా గృహ రుణాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications