దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. పూర్తి వివరాలు ఇవిగో..
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సు నేటి నుంచి మొదలైంది. ఈ నెల 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు కొనసాగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. సుమారు 65 దేశాల అధిధినేతలు, 130 దేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది మంది రాజకీయ, ఆర్థిక, వ్యాపార నేతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. అంతేకాకుండా, ప్రపంచంలో పేరుగాంచిన కంపెనీలకు చెందిన 850 మంది అగ్రశ్రేణి సీఈవోలు, చైర్మన్లు, వ్యవస్థాపకులు కీలక చర్చల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరవుతుండటం విశేషం. గ్లోబల్ రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వాతావరణం, భవిష్యత్ వృద్ధి అవకాశాలపై ఆయన ప్రసంగం కీలకంగా ఉండనుంది. ఈ సదస్సులో ముఖ్యంగా పోటీ ప్రపంచంలో సహకారం, ఆవిష్కరణల ఆధారిత వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి.

భారతదేశం నుంచి కూడా ఈ సదస్సుకు భారీ స్థాయిలో ప్రతినిధులు హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, పలు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు దావోస్ వేదికపై భారత్ పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి బయల్దేరి దావోస్‌కు ప్రయాణమయ్యారు. జ్యూరిచ్ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్‌తో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు.
జ్యూరిచ్‌లో తొలుత నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని.. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన దావోస్‌కు చేరుకుంటారు. అక్కడ నాలుగు రోజుల పాటు పర్యటించనున్న ఆయన మొత్తం 36 విభిన్న కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో ప్రభుత్వాల మధ్య జరిగే 3 ద్వైపాక్షిక సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో 16 వన్-టు-వన్ మీటింగ్‌లు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, అలాగే ప్లీనరీ సెషన్లు ఉన్నాయి.
దావోస్‌లో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో పాటు ఇతర శాఖల ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. అలాగే టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరపనున్నారు. స్విట్జర్లాండ్, యూఏఈ సహా పలు దేశాల ప్రతినిధులతో సమావేశమై, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా దావోస్‌కు బయల్దేరి వెళ్లనుంది. తెలంగాణకు వివిధ రంగాల్లో పెట్టుబడులు తీసుకురావడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. Davos వేదికపై తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. అలాగే క్యూర్, ప్యూర్, రేర్ విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వివరించనున్నారు.
భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి కీలకమైన భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ నది పునరుజ్జీవనం, డ్రైపోర్ట్, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులను కూడా రేవంత్ రెడ్డి దావోస్ సదస్సులో ప్రస్తావించనున్నారు. రేపు తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీతో పాటు ఏఐ హబ్‌లను ఆవిష్కరించనుండటం మరో విశేషం. ఈ విధంగా దావోస్ వేదికపై తెలుగు రాష్ట్రాలు ప్రపంచ పెట్టుబడుల దృష్టిని ఆకర్షించేందుకు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications