HCLTech News: దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం అనేక పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో అనేక భారతీయ కంపెనీలతో పాటు ఇతర దేశాలకు చెందిన కంపెనీల నుంచి కూడా పెట్టుబడులను రాబట్టే పనిలో సీఎంఓ టీమ్ గట్టిగా కృషి చేస్తోంది. దీంతో వరుసగా ఎంవోయూలు కుదుర్చుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు.
దేశంలోని టాప్-5 ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ప్రముఖ టెక్నాలజీ కంపెనీ HCLTech. ఈ క్రమంలో కంపెనీ తన వ్యాపారాన్ని హైదరాబాదులో మరింతగా విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కొత్త టెక్ సెంటర్‌ను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్‌లో తన గ్లోబల్ డెలివరీని పెంచాలని నిర్ణయించింది. దావోస్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన హెచ్సీఎల్ సీఈవో, ఎండీ విజయకుమార్ ఈ మేరకు కొత్త పెట్టుబడి నిర్ణయాన్ని ప్రకటించారు.

హైదరాబాదులో కొత్తగా ఏర్పాటు చేయనున్న సెంటర్.. హైటెక్, లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి పరిశ్రమల్లోని గ్లోబల్ క్లయింట్‌లకు అత్యాధునిక క్లౌడ్, ఏఐ అండ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పరిష్కారాలను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. టెక్ కంపెనీకి హైటెక్ సిటీలో ఉన్న క్యాంపస్ కొత్తగా 5,000 మంది ఐటీ ఉద్యోగులకు అవకాశాన్ని కల్పిస్తుందని తెలుస్తోంది. ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్‌తో రావటం స్థిరమైన వ్యాపార పద్ధతులపై కంపెనీకి ఉన్న నిబద్ధతను నొక్కి చెబుతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాదు నగరం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు అత్యధిక టాలెంట్ కలిగిన టాలెంట్ అందుబాటులో ఉందని సీఈవో విజయకుమార్ పేర్కొన్నారు. ఇది కంపెనీకి వ్యూహాత్మకంగా కీలకమైన స్థానంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త కేంద్రం తమ ప్రపంచ క్లయింట్ స్థావరానికి అత్యాధునిక సామర్థ్యాలను తీసుకువస్తుందని, స్థానిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు దోహదపడుతుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి, ఐటీ మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించబడుతుందన్నారు.
టెక్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్ తీసుకున్న పెట్టుబడి నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో హైదరాబాదును మరింతగా ముందుకు తీసుకెళ్లటానికి ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలను ప్రోత్సహించడానికి హైదరాబాద్‌లోని టెక్, ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసి టైర్-2,3 నగరాలకు విస్తరించటంపై తాము దృష్టి సారించినట్లు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నొక్కి చెప్పారు 2007 నుంచి హైదరాబాదులో ఉన్న హెచ్సీఎల్ టెక్.. కొత్త విస్తరణతో కలిపి 5 కేంద్రాలతో 8,500 ఉద్యోగుల సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications