IT News: రెండేళ్ల నుంచి నాన్‌స్టాప్‌గా టెక్ లేఆఫ్స్.. గంటకు ఎంత మంది ఉద్యోగం కోల్పోతున్నారంటే..
IT News: కరోనా వేళ భారీగా రిక్రూట్ చేసుకున్న కంపెనీలు.. ఈమధ్య కొత్త ఉద్యోగాలిచ్చేందుకు మొహం చాటేస్తున్నాయి. ఇందుకు అదనంగా కనికరం లేకుండా వేలాది మందిని ఇంటికి పంపుతున్నాయి. గతేడాది నుంచి ప్రారంభమైన ఈ పరిస్థితి ఇప్పట్లో మారేలా కనిపించడం లేదు. గణాంకాల ప్రకారం రోజుకు ఎంత మంది ఉద్యోగాలు కోల్పోతున్నారో తెలిస్తే ఫ్రెషర్ల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లు సహా వివిధ టెక్ కంపెనీలు.. గత రెండేళ్లలో (అక్టోబర్ 13 వరకు) 4 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. అదే సమయంలో 110 భారతీయ స్టార్టప్‌లు దేశంలో 30 వేల మందిని ఇంటికి పంపాయి. ఈ మేరకు టెక్ సెక్టార్ ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ layoff.fyi డేటా విశ్లేషిస్తే షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 2 వేల 120 టెక్ కంపెనీలు 4 లక్షల 4 వేల 962 మంది ఉద్యోగులను తొలగించాయి. 2023 మొదటి 6 నెలల్లోనే 2 లక్షల మంది కొలువులు కోల్పోయారు. ఇక 2022లో 1,061 టెక్ కంపెనీలు లక్షా 64 వేల 769 మంది ఉద్యోగులను తొలగించగా.. 2023లో 1,059 కంపెనీలు అక్టోబర్ 13 వరకు 2 లక్షల 40 వేల 193 మందికి ఉద్వాసన పలికాయి.
అంటే గత రెండేళ్లలో సగటున ప్రతిరోజూ దాదాపు 555 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ప్రతి గంటకు 23 మంది కార్మికుల కొలువులపై వేటు పడింది. ఒక్క జనవరిలోనే ఈ సంఖ్య 89 వేల 554 కావడం గమనార్హం. గత నెలలో చూస్తే 4 వేల 632 మంది ఉద్యోగులను తొలగించారు. అయితే సంఖ్యా పరంగా కౌంట్ తగ్గినా.. తొలగింపులు మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications