గంటల్లో రూ.4.4 లక్షల కోట్ల సంపద పెరిగింది, ఈ స్టాక్స్ మాత్రం డౌన్
డొమెస్టిక్ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమై, అదే ఒరవడితో కొనసాగుతున్నాయి. ఉదయం 800 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, ఆ తర్వాత 1100 పాయింట్లకు పైగా ఎగిసిపడింది. నేడు మార్కెట్లు భారీగా ఎగిసిపడటంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.5 లక్షల కోట్ల వరకు పెరిగింది. సెన్సెక్స్ గతవారం 54,884 పాయింట్ల వద్ద, నిఫ్టీ 16,352 పాయింట్ల వద్ద ముగిసింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఏప్రిల్ నెలలో అమెరికాలో వినియోగదారుల వ్యయం తగ్గలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఫెడ్ తీసుకున్న నిర్ణయాలు ద్రవ్యోల్బణ పెరుగుదలను కట్టడి చేస్తాయని ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక మందగమన ఛాయలు క్రమంగా కనుమరుగయ్యే అవకాశాలు ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరుస్తోంది.

సెన్సెక్స్ ఉదయం 55,507 పాయింట్ల వద్ద ప్రారంభమ, 56,082 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,466 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,527 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,695 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,506 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1.45 సమయానికి సెన్సెక్స్ 1068 పాయింట్లు ఎగిసి 55,953 పాయింట్ల వద్ద, నిఫ్టీ 309 పాయింట్లు లాభపడి 16,662 పాయింట్ల వద్ద కదలాడింది. నేడు మార్కెట్లు అదరగొడుతున్నప్పటికీ పలు స్టాక్స్ మాత్రం 5 శాతం పైగా నష్టపోయాయి. కల్పన ఇండస్ట్రీస్ 20 శాతం, ఆయుష్ ఫుడ్ అండ్ హెర్బ్స్ 20 శాతం, మొన్నెట్ ఇస్పాట్ 19 శాతం, సంబంధం స్పిన్ 16 శాతం, యూనిక్ ఆర్గానిక్స్16 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications