సైరస్ మిస్త్రీకి సుప్రీం కోర్టు నోటీసులు, అదే పాయింట్ లాగిన టాటా!
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో సైరస్ మిస్త్రీకి ఎదురుదెబ్బ తగిలింది. టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీని పునరుద్ధరిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLAT) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు శుక్రవారం నిలిపివేసింది. టాటా గ్రూప్ చీఫ్‌గా సైరస్ మిస్త్రీ పునరుద్ధరణకు గత ఏడాది డిసెంబర్ 18న NCLAT తీర్పు ఇచ్చింది. దీనిని టాటా సన్స్ భారత అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది. మిస్త్రీకి నోటీసులు జారీ చేసింది.

టాటా సన్స్ లాగిన పాయింట్ ఇదీ...
సైరస్ మిస్త్రీ వ్యవహారంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టాటా సన్స్ ఆయన ఐరిష్ పౌరసత్వాన్ని లాగింది. పౌరసత్వం వదులుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదని తెలిపింది. తాను ఐరిష్ పౌరసత్వం వదులుకుంటానని సైరస్ మిస్త్రీ 2011లో చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన దానిని వదిలివేయలేదు. ఐరిష్ మీడియా ప్రకారం అత్యంత ధనిక ఐరిష్‌లలో అతను ఒకరు.

అక్కడ అనుకూలంగా తీర్పు
టాటా సన్స్ 2016లో అక్టోబర్ 24న సైరస్ మిస్త్రీని కంపెనీ అత్యున్నత పదవి నుంచి తొలగించింది. కార్పోరేట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా తనను తొలగించారని ఆరోపిస్తూ మిస్త్రీ న్యాయపోరాటం చేశారు. ఇందులో భాగంగా NCLATను ఆశ్రయించారు. అక్కడ అయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. మిస్త్రీ తొలగింపు, అలాగే టాటా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్‌ను నియమించడాన్ని NCLAT తప్పుబట్టింది. ఈ తీర్పుతో మిస్త్రీనే సీఈవోగా బాధ్యతలు చేపట్టే పరిస్థితులు వచ్చాయి. అయితే తనకు టాటా సన్స్ లేదా ఇతర గ్రూప్ కంపెనీల్లో చైర్మన్ లేదా ఎగ్జిక్యూటివ్ పదవులు చేపట్టాలనే ఆసక్తి లేదని, హోల్డింగ్ కంపెనీ బోర్డులో మాత్రం చోటు కోరుకుంటున్నట్లు తెలిపారు. కంపెనీలో చేరే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన ఇటీవల కూడా చెప్పారు.

మిస్త్రీకి నోటీసులు
NCLAT తీర్పుపై టాటా సన్స్ ఈ నెల ప్రారంభంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టాటా సన్స్‌తో పాటు రతన్ టాటా, టీసీఎస్, టాటా ట్రస్టీలు పిటిషన్ వేశాయి. ఈ పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం స్టే విధించి, మిస్త్రీకి నోటీసులు జారీ చేసింది.


Click it and Unblock the Notifications