కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైకిల్ సేల్స్ భారీగా పెరిగాయి. గత ఐదు నెలల కాలంలో ఏకంగా రెండింతల వృద్ధిని నమోదు చేశాయి. వైరస్ నేపథ్యంలో ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని చాలామంది తమ ప్రయాణం కోసం సైకిళ్లను ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సైకిళ్లకు భలే డిమాండ్ ఉందని, ఫలితంగా పలు నగరాల్లో ప్రజలు తమకు నచ్చిన సైకిల్‌ను కొనుగోలు చేసేందుకు కొంతకాలం పాటు వేచిచూసే ధోరణి కనిపిస్తోందని తయారీదారులు చెబుతున్నారు.

నచ్చిన సైకిల్ కోసం వెయిటింగ్...
ఆల్ ఇండియా బైస్కిల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(AICMA) నివేదిక ప్రకారం గత అయిదు నెలల కాలంలో భారత్‌లో 41,80,945 సైకిల్స్ విక్రయించారు. ఈ సేల్స్ మే నెల నుండి సెప్టెంబర్ కాలంలో జరిగాయి. సేల్స్‌లో మంచి వృద్ధి నమోదు కనిపించిందని AICMA సెక్రటరీ జనరల్ కేబీ ఠాకూర్ అన్నారు. గత అయిదు నెలల కాలంలో సైకిల్ సేల్స్ 100 శాతం పెరిగాయని, అంతేకాదు, చాలా ప్రాంతాల్లో తమకు నచ్చిన సైకిల్ దొరికే వరకు వేచి చూస్తున్నారని ఆయన చెప్పారు.

ముందుగా బుక్ చేసుకుంటేనే..
మే నెలలో 4,56,818 సైకిల్స్ సేల్ అయ్యాయి. కానీ జూన్ నెలలో సేల్స్ దాదాపు రెండింతలు పెరిగి 8,51,060 యూనిట్లకు చేరుకున్నాయి. అదే సెప్టెంబర్ నెలలో ఏకంగా 11,21,544 యూనిట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా గత అయిదు నెలల కాలంలో 41,80,945 సైకిళ్లు విక్రయించారు. కొన్ని నగరాల్లో ముందుగా బుక్ చేసుకుంటే తప్ప సైకిళ్లు దొరకని పరిస్థితి. స్థానిక రిటైలర్లు కూడా సేల్స్ 15 శాతం నుండి 50 శాతం పెరిగినట్లు చెబుతున్నారు.

మంచి అవకాశం
అంతర్జాతీయ మార్కెట్లో భారత సైకిల్ పరిశ్రమ చొచ్చుకెళ్లేందుకు ఇది మంచి అవకాశమని హీరో సైకిల్స్ సీఎండీ చెబుతున్నారు. ఇప్పటికే చైనా నుండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వియత్నాం, థాయ్‌లాండ్, తైవాన్ వంటి దేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నాయని, భారత్‌కు ఇది మంచి అవకాశమని చెబుతున్నారు. హీరో ఇటీవలే హీరో ఎలక్ట్రో ఈ-సైకిల్స్‌ను లాంచ్ చేసింది. మార్కెట్లో ఈ కంపెనీ వాటా 72 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications