Trading Fraud: జాగ్రత్తయ్యా.. కొత్త ట్రేడింగ్ మోసం.. రూ.2 కోట్లు పోగొట్టుకున్న అమ్మాయి..
e-trading Fraud: దేశంలో ఇటీవలి కాలంలో ప్రజలు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బును పొందాలనే ఆలోచనతో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మోసగాళ్లు దీనినే ఆసరగా మార్చుకుని ఏకంగా కోట్లు కొట్టేస్తున్నారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడతామని సైబర్ మోసగాళ్లు యువతను, మహిళలను టార్గెట్ చేస్తున్న ఘటన బయటపడింది. అలా సైబర్ కేటుగాళ్లు ఒక మహిళ వద్ద ఏకంగా రూ.2 కోట్లు కొల్లగొట్టారనే విషయం సంచలనంగా మారింది. 35 ఏళ్ల మహిళ ఆన్‌లైన్ ట్రేడింగ్ గురించి సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటనలను చూసింది. ఆ లింక్ ఒక వాట్సాప్ గ్రూప్‌కు దారితీసింది. అందులో ఆన్‌లైన్ ట్రేడింగ్ గురించి నిందితుడు ఆమెకు వివరించారు. ఆమెకు శిక్షణ ఇవ్వడానికి రెండు సెషన్‌లు నిర్వహించారని సదరు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది.

దీని తర్వాత సదరు నిందితుడు మహిళకు ఆన్‌లైన్ ట్రేడింగ్ కోసం మరో లింక్ పంపారు. సదరు లింక్ ఉపయోగించి ఆమె డబ్బుతో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. ఆ సమయంలో వర్చువల్ వాలెట్ లో తన పెట్టుబడి మెుత్తంతో పాటు లాభాలను చూడటంతో ఆమె నిజంగానే సంతోషించింది. ఈ క్రమంలో నిందితులు పెట్టుబడి కోసం డబ్బు పంపేందుకు నిందితుడు ఆమెకు పలు ఖాతా నంబర్లను ఇచ్చారు.
పెట్టుబడి ప్రక్రియ మెుత్తం సజావుగానే కొనసాగుతున్నట్లు అనుకున్న మహిళ తన పెట్టుబడిని రూ.కోటికి మించి చేసింది. అయితే పెట్టుబడి మెుత్తం కోటి దాటిన తర్వాత ఆమె ఖాతాలోకి మనీ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు నిందితుడిని అడిగినప్పుడు.. అతను లాభంపై పన్నులు చెల్లించాలని చెప్పారు. ఇలా నెల రోజులు గడిచినా ఆ తర్వాత కూడా డబ్బును బదిలీ చేయలేకపోయింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన సదరు మహిళ పోలీసులను సంప్రదించింది.


Click it and Unblock the Notifications