Trading Fraud: ప్రజల్లో స్టాక్ మార్కెట్లపై అవగాహన రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా తర్వాత అనేక మంది యువత సైతం దీనిలోకి వస్తున్నారు. ఇలాంటి కొత్త ట్రేడర్లను టార్గెట్ చేసుకుని సైబర్ మోసగాళ్లు లక్షల రూపాయల నుంచి కోట్లు కొల్లగొడుతున్నారు.
తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఒక ఈఎంటీ డాక్టర్ సైతం ఈ సైబర్ మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల పేరుతో జరిగిన మోసంలో ఏకంగా రూ.8.60 కోట్లు పోగొట్టుకున్నారు. వాస్తవానికి నగరానికి చెందిన డాక్టర్ మూడు నెలల కిందట తన ఫోన్ బ్రౌస్ చేస్తుండగా.. ఆ సమయంలో సైబర్ నేరగాళ్లు ఇచ్చిన ఫేస్ బుక్ యాడ్ మాయలో పడ్డాడు. తనకు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని ఉందంటూ వారిని సంప్రదించటంతో కేటుగాళ్ల వలలో చిక్కుకున్నారు. అలా వారు అడిగిన అన్ని వివరాలు ఇచ్చాక మాయగాళ్లు సదరు డాక్టర్‌ను సంప్రదించారు.

అప్పటి నుంచి పలు దఫాలుగా నేరగాళ్లు డాక్టర్ నుంచి డబ్బు తమ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అయితే తాను మోసపోయానని గుర్తించిన సదరు డాక్టర్ చివరికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. 50 ఏళ్ల ఈఎంటీ డాక్టర్ వాస్తవానికి కేపీహెచ్‌బీలో సొంత క్లీనిక్ నిర్వహిస్తున్నారు. సైబర్ కేటుగాళ్లు సదరు డాక్టర్ Facebook ప్రకటనపై క్లిక్ చేసిన తర్వాత స్టాక్‌లలో ట్రేడింగ్‌కు సంబంధించి JP మోర్గాన్ చేజ్ సెక్యూరిటీస్, గోల్డ్‌మన్ సాక్స్ కంపెనీ, మ్యాన్ గ్రూప్, UBS సెక్యూరిటీస్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లుగా పరిచయం చేసుకుంటూ నలుగురు వ్యక్తులు తనకు కాల్ చేసినట్లు మోసపోయిన డాక్టర్ వెల్లడించారు.
తాము ప్రముఖ బ్రోకరేజ్ కంపెనీలకు సబ్ బ్రోకర్స్ అంటూ డాక్టర్ కు నమ్మబలికారు. NSE, BSE వంటి నియంత్రణ సంస్థల నుంచి పన్ను విధించడం వంటి అవసరమైన డాక్యుమెంటేషన్ గురించి ఫిర్యాదుదారు వారిని అడిగినప్పుడు, అన్ని చట్టబద్ధమైన అవసరాలకు తాము కట్టుబడి ఉన్నారని హామీ ఇచ్చారు. సంస్థాగత పెట్టుబడిదారులుగా, వారు గోప్యత ఒప్పందాలకు కట్టుబడి ఉన్నారని, అందువల్ల కంపెనీల గురించి వివరణాత్మక సమాచారాన్ని వెల్లడించలేమని డాక్టరుకు చెప్పారు. అలా వారు పంపిన లింక్స్ ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ట్రేడింగ్ ప్రారంభించినట్లు డాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో కొంత కాలం ట్రేడింగ్ సమయంలో మెుత్తం డబ్బు నుంచి కొన్ని సార్లు అవసరం మేరకు పెట్టుబడి సొమ్మును విత్‌డ్రా చేసుకున్నాక మోసగాళ్లను పూర్తిగా నమ్మాడు డాక్టర్. ఈ విధంగా మే నుంచి కొద్ది రోజుల క్రితం వరకు 8,60,38,022 పెట్టుబడి పెట్టారు. డాక్టర్ తన లాభాలను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, నిర్వాహకులు లాభ డివిడెండ్‌పై 20%, స్వల్పకాలిక లాభాల పన్ను కోసం మరో 30% చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము అడిగిన పర్సంటేజీలు చెల్లించాలని వేధించడం ప్రారంభించినప్పుడు డాక్టర్ తాను మోసపోయినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.


Click it and Unblock the Notifications