Layoffs: కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఆర్థిక అనిశ్చితుల మధ్య ఖర్చులను తగ్గించుకుంటూ, లాభాలు పెంచుకోవడానికి పలు సంస్థలు ఈ తరహా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తద్వారా జాబ్ మార్కెట్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. తాజాగా మరో సంస్థ భారీ లేఆఫ్స్ కు తెరతీసింది.
అమెరికాకు చెందిన ప్రముఖ రిటైల్ ఫార్మా, హెల్త్ కేర్ సొల్యూషన్స్ కంపెనీ 'CVS హెల్త్ కార్పొరేషన్' తన ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. మొత్తం వర్క్ ఫోర్స్ లో 5 వేల మందికి ఉద్వాసన పలకనున్నట్లు వెల్లడించింది. తద్వారా ఖర్చులు తగ్గించుకుంటూ, ఆరోగ్య సంరక్షణ సేవలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చూస్తోంది.

హోమ్ కేర్ ప్రొవైడర్ సిగ్నిఫై హెల్త్, ప్రైమరీ-కేర్ కంపెనీ ఓక్ స్ట్రీట్ హెల్త్ లను CVS ఇటీవల అక్వైర్ చేసింది. తద్వారా తన రిటైల్ బిజినెస్ నుంచి హైల్త్ కేర్ దిశగా మరింత విస్తరించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఉద్యోగాల కోత విధించింది. తమ క్లినికల్ ట్రయల్స్ యూనిట్ ను సైతం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిగా మూసివేయనున్నట్లు మేలోనే ప్రకటించింది.

అయితే స్టోర్స్, ఫార్మసీలు, క్లినిక్స్ లేదా కస్టమర్ సర్వీస్ సెంటర్‌లలో కస్టమర్-ఫేసింగ్ పొజిషన్‌లను ఈ లేఆఫ్స్ వల్ల ప్రభావితం కావని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రత్యర్థి సంస్థ వాల్ గ్రీన్స్ బూట్స్ అలయన్స్ ఇంక్ కూడా ఇటీవల రిటైల్ ఫార్మసీ కార్యకలాపాల నుంచి వైదొలగే సమయంలో ఇదే విధంగా ఉద్యోగాల కోత విధించింది. దాని కార్పొరేట్ వర్క్ ఫోర్స్ లో 504 మందిని తొలగించగా.. ఇప్పుడు CVS సైతం అదే బాటలో నడుస్తోంది.


Click it and Unblock the Notifications