Gujarat Titans: దేశంలోని అగ్ర వ్యాపారవేత్తల్లో ఒకరుగా కొనసాగుతున్న అదానీ తాజాగా మరో అడుగు ముందుకేస్తున్నారు. ఇప్పటికే పోర్ట్స్ నుంచి పవర్ వరకు ఉన్న వ్యాపారాలతో పాటు మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అదానీ.. అంబానీతో పోటీ పడేందుకు సిద్ధమౌతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో అదానీ గ్రూప్ త్వరలో 'ఇండియన్ ప్రీమియర్ లీగ్'లోకి ప్రవేశించవచ్చని కథనాలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్ జట్టులో వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ చర్చలు జరుపుతోంది. ఇదే జరిగితే అంబానీ-అదానీలు ఒకటే వ్యాపారంలోకి అడుగుపెట్టి నేరుగా పోటీపడనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు వ్యాపారవేత్తలు సోలార్ ఎనర్జీ, మీడియా, ఎఫ్ఎంసీజీ వంటి రంగాల్లో తమ వ్యాపార పోటీని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు ఆదరిస్తున్న ఐపీఎల్‌లో టీమ్ ఫ్రాంచైజీలను సెలబ్రిటీలతో పాటు బడా వ్యాపారవేత్తలు కలిగి ఉన్నారు. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ముంబై ఇండియన్స్ టీమ్‌ను మొదటి నుంచి హోల్డ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టీమ్ కొనుగోలు ద్వారా అంబానీ 2023లో రూ.359 కోట్లు ఆర్జించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ముంబై టీమ్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటి కావటంతో పాటు ఇప్పటి వరకు నిర్వహించిన టోర్నమెంట్లలో అత్యధిక విజయాలను కైవసం చేసుకుంది. అందుకే హార్థిక్ పాండే కెప్టెన్సీలో కొనసాగుతున్న టీమ్‌కు క్రేజ్ ఎక్కువ.
ప్రస్తుతం కొనసాగుతున్న ఊహాగానాలు, వార్తా కథనాల ప్రకారం ప్రకారం.. వ్యాపారవేత్త గౌతం అదానీ ఐపీఎల్ టీమ్ గుజరాత్ టైటాన్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయవచ్చు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ CVC క్యాపిటల్ పార్టనర్స్ గుజరాత్ టైటాన్స్‌లో తన వాటాను విక్రయించడానికి అదానీ గ్రూప్‌తో ఇప్పటికే చర్చలు జరుపుతోంది. ఇదే క్రమంలో వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థ టోరెంట్ గ్రూప్‌తో కూడా సీవీసీ చర్చలు జరుపుతోందని నివేదించబడింది. మెుత్తానికి డీల్ సెట్ అయితే త్వరలో అదానీ సైతం క్రీడా రంగంలో ఐపీఎల్ కొనుగోళ్ల ద్వారా అడుగుపెట్టవచ్చు.


Click it and Unblock the Notifications