జీఎస్టీ తర్వాత ప్రభుత్వం దృష్టి దీనిపైనే ! 2026 బడ్జెట్ లక్ష్యం అదేనా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్‌కు ముందు కీలక సంకేతాలు ఇచ్చారు. దేశీయంగా ఆదాయపు పన్ను (Income Tax), వస్తు సేవల పన్ను (GST) వ్యవస్థల్లో ఇప్పటికే సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం.. తదుపరి దృష్టిని 'కస్టమ్స్ ఫ్రేమ్‌వర్క్' పై కేంద్రీకరించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కస్టమ్స్ నిబంధనలను సులభతరం చేయడం, పారదర్శకతను పెంచడం ద్వారా వాణిజ్య ప్రక్రియను మరింత సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు.

కస్టమ్స్ సంస్కరణలే లక్ష్యం
హెచ్‌టీ లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడిన నిర్మలా సీతారామన్.. పౌరుల చేతుల్లో ఎక్కువ నగదు ఉండేలా చూసి, తద్వారా వినియోగాన్ని పెంచడానికి ఇప్పటికే ట్యాక్స్ వ్యవస్థలను సరిచేశామని గుర్తు చేశారు. ఇప్పుడు తర్వాతి అతిపెద్ద సంస్కరణలు జరగాల్సింది కస్టమ్స్(customs reform) లోనే అని పేర్కొన్నారు.
ఆమె మాటల్లో చెప్పాలంటే..
"కస్టమ్స్ వ్యవస్థలో పూర్తి స్థాయి సమూల మార్పులు అవసరం. ప్రజలు నిబంధనలకు కట్టుబడి ఉండడం భారంగా అనిపించకుండా సరళతరం చేయాలి. పారదర్శకతను మరింత పెంచాలి." అని ఆమె అన్నారు. ఆదాయపు పన్ను సంస్కరణలకు మార్గనిర్దేశం చేసిన పారదర్శకత, సరళత వంటి అంశాలనే కస్టమ్స్ పాలనకు కూడా తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కస్టమ్స్ సుంకాల రేట్లను కూడా మరింత హేతుబద్ధీకరించే అవకాశం ఉందని ఆమె సూచించారు.
సుంకాల రేట్ల తగ్గింపు, కొత్త స్లాబ్స్
గత రెండు బడ్జెట్‌లలో కస్టమ్స్ సుంకాల రేట్లను ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. 2023-24లో ఏడు సుంకాల స్లాబ్‌లను తొలగించిన తర్వాత ఈ ఏడాది బడ్జెట్‌లో పారిశ్రామిక వస్తువులపై ఏడు అదనపు కస్టమ్స్ టారిఫ్ రేట్లను తొలగించాలని ప్రతిపాదించారు. దీంతో మొత్తం కస్టమ్స్ టారిఫ్ స్లాబ్‌ల సంఖ్య సున్నా రేటుతో సహా ఎనిమిదికి తగ్గింది. అయితే కొన్ని వస్తువులపై సుంకాల రేట్లు ఇంకా అత్యధికంగా ఉన్నాయని, వాటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉందని మంత్రి అంగీకరించారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఈ customs reform సంబంధించిన ప్రకటనలు ఉండే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు.
ఆర్థిక వృద్ధిపై భరోసా
ఆర్థిక వృద్ధి విషయానికి వస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 7 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. గత జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ క్షీణించడంపై స్పందిస్తూ... రూపాయి త్వరలోనే తన సహజ స్థాయికి చేరుకుంటుందని ఆమె అన్నారు. అయితే విదేశీ నిధుల అవుట్‌ఫ్లో, అధిక ముడి చమురు ధరల కారణంగా రూపాయి విలువ ఇటీవల తొలిసారిగా డాలర్‌కు 90 మార్కును అధిగమించి, చారిత్రక కనిష్టానికి (90.21) చేరుకుంది.


Click it and Unblock the Notifications