SBI: SBI సర్వర్ డౌన్.. నెట్ బ్యాంకింగ్, YONO, UPI సేవలకు విఘాతం.. సోషల్ మీడియాను షేక్ చేసిన కస్టమర్లు
SBI: దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కానీ సేవల నాణ్యత విషయంలో మాత్రం అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటోంది. భౌతికంగా బ్యాంకుకు వెళ్లకుండా అంతర్జాలంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలూ ఉన్నాయి. సోషల్ మీడియాలో తమ బాధ వెళ్లగక్కిన సందర్భాలు తక్కువేం కాదు. ఈ తరహా ఘటనే మరోసారి జరిగింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు చెందిన UPI, నెట్ బ్యాంకింగ్ మరియు YONO సేవలను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు ఆయా సేవల వినియోగదారులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని గంటల పాటు SBI సర్వర్ డౌన్ కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే దీనిపై పలు సోషల్ మీడియా ప్లాట్ ఫారంల ద్వారా ఖాతాదారులు ఫిర్యాదు చేశారు.

వెబ్‌సైట్-మానిటరింగ్ సర్వీస్ డౌన్ డిటెక్టర్ ప్రకారం.. ఈరోజు ఉదయం 9:19 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. అయితే గత 2 రోజులుగా బ్యాంకు సేవలను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు మరికొంత మంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది మాత్రం నేటి ఉదయం నుంచి సేవల్లో లోపం తలెత్తినట్లు పేర్కొన్నారు.

వినియోగదారులు లేవనెత్తిన సర్వర్ అవుటేజ్ ఫిర్యాదులకు సంబంధించి SBI తరఫు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడం వల్ల ఏప్రిల్ 1న మధ్యాహ్నం 1.30 నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్, YONO, UPI సేవలు అందుబాటులో ఉండవని అదేరోజు పేర్కొంది. ఖాతాల వార్షిక ముగింపు కోసం ఏటా ఏప్రిల్ 1న బ్యాంకులకు RBI సెలవు ప్రకటించిన విషయం గమనార్హం.


Click it and Unblock the Notifications