Current Account Deficit: దేశీయ వాణిజ్య, సేవా రంగాల్లో ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసాన్ని కరెంటు ఖాతా లోటు(CAD)గా లెక్కిస్తారు. ఈ ఏడాదికి సంబంధించి గత రెండు త్రైమాసికాల CAD గణాంకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే లోటు భారీగా పెరిగినట్లు తెలిపింది.
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు దాదాపు 7 రేట్లు పెరిగి 9.2 బిలియన్ డాలర్లకు చేరినట్లు RBI వెల్లడించింది. ఏప్రిల్-జూన్ మధ్య నమోదైన ఈ లోటు.. దేశ GDPలో 1.1 శాతానికి సమానమని తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం వాణిజ్య లోటేనని స్పష్టం చేసింది.

సేవల విభాగంలో తగ్గిన సర్ ప్లస్ మరియు ప్రైవేటు ట్రాన్స్ఫర్ రిసీట్లలో క్షీణత లోటు పెరగడానికి మరో కారణంగా RBI పేర్కొంది. గతేడాది ఏప్రిల్-జూన్ మధ్య డేటా చూస్తే CAD 17.9 బిలియన్ డాలర్లు(GDPలో 2.1 శాతం)గా ఉంది. అంటే ఏడాది ప్రాతిపదికన మొదటి త్రైమాసికం గణాంకాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.
కంప్యూటర్లు, సేవలు, ట్రావెల్స్ విభాగాల్లో ఎగుమతులు మందగించడం వల్ల నికర సేవల వసూళ్లు తగ్గినట్లు సెంట్రల్ బ్యాంక్ చెబుతోంది. అయితే పెరిగిన ఆయిల్, ఇతర ముడి పదార్థాల దిగుమతులతో పాటు సేవల విభాగం ఎగుమతుల్లో క్షీణత కారణంగా సెప్టెంబర్ త్రైమాసికానికి కరెంట్ ఖాతా లోటు మరింత పెరగనున్నట్లు ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడ్ ఎకానమిస్ట్ మాధవి అరోరా తెలిపారు.
ఇవన్నీ కలిపి చూస్తే జూలై -సెప్టెంబర్ వాణిజ్య లోటు ఏప్రిల్-జూన్ మధ్య లోటుకి రెండింతలు ఉంటుందని భావిస్తున్నట్లు అరోరా అభిప్రాయపడ్డారు. ఇది కాస్తా GDPలో 2.4-2.6 శాతం వరకు ఉండొచ్చన్నారు. ఐకార్ చీఫ్ ఎకానమిస్ట్ అతిథి నాయర్ కూడా దాదాపు ఇదే రకంగా అంచనా వేశారు. 2022-2023లో 67 బిలియన్ డాలర్లుగా ఉన్న CAD కాస్తా 2023-24లో 75 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications