Ashish Malik Arrest: రష్యా ఆయిల్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో కోట్లలో మోసానికి పాల్పడిన నిందితుడిని ఈడీ అరెస్ట్ చేసింది. 52 కోట్ల క్రిప్టో కుంభకోణంలో నిందితుడు ఆశిష్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) ప్రత్యేక కోర్టు ఈడీ కస్టడీకి అనుమతించింది.

రష్యా ఆయిల్ కంపెనీ..
ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ విచారిస్తున్న అదే కేసులో క్రిప్టో బ్రోకర్ ఆశిష్ మాలిక్‌ను సెప్టెంబర్ 10న తీహార్ జైలు నుంచి ఫెడరల్ ఏజెన్సీ కస్టడీలోకి తీసుకుంది. రష్యాకు చెందిన ప్రముఖ చమురు కంపెనీ రోస్‌నెఫ్ట్‌కు చెందిన హెడ్జ్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు పెడుతున్నట్లు అనేక మంది నుంచి నిందితుడు నిధులు సేకరించాడు. అధిక ఆదాయం వస్తుందంటూ ఎరవేశాడు. అలా వారి నుంచి కోట్లాది రూపాయలు స్వాహా చేసిన కేసులో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.

1000 మందిని బురిడీ..
రోస్‌నెఫ్ట్ అనే రష్యన్ ఆయిల్ కంపెనీలో పెట్టుబడులు పెడతాననే సాకుతో 1,000 మందికి పైగా మోసగించినందుకు మాలిక్‌ను మే నెలలో EOW అరెస్టు చేసినట్లు ED తెలిపింది. నిందితుడితో పాటు సహచరులు సునీల్ సింగ్, సందీప్ కౌశిక్ ప్రజలకు 20 శాతం రాబడి వస్తుందంటూ డబ్బు వసూలు చేశారు. నిందితులు 'RHFCOIN', 'RHFGOLD' అనే పేరుతో రెండు క్రిప్టో కరెన్సీ కాయిన్లను విడుదల చేసినట్లు ED తెలిపింది.

క్రిప్టో కరెన్సీ..
దేశవ్యాప్తంగా ప్రజల నుంచి కోట్లాది రూపాయలు సేకరించిన నిందితులు వాటిని క్రిప్టో కరెన్సీల్లో, ఎక్కువగా బిట్‌కాయిన్‌ల్లో పెట్టుబడి పెట్టి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అలా రూ.52 కోట్లు స్వాహా చేశారు. అసలు మెుత్తం ఎంత మోసం జరిగింది, దానిని నిందితులు ఏం చేశారు వంటి కీలక అంశాలను వెలికితీసేందుకు అధికారులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.

హెడ్జ్ ఫండ్ అంటే ఏమిటి..?
సాధారణ పెట్టుబడులకు హెడ్జ్ ఫండ్స్ భిన్నంగా ఉంటాయి. వీటిలో రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. హెడ్జ్ ఫండ్స్ అనేవి లిమిటెడ్ భాగస్వాములతో కూడిన ప్రైవేట్ పెట్టుబడి. ఇందులో పెట్టుబడి కోసం ఉన్న డబ్బును ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తుంటారు. వాటికి సంబంధించిన అన్ని పెట్టుబడి వ్యూహాలు, నిర్ణయాలను సదరు ఫండ్ మేనేజర్ చూసుకుంటారు. ఇలాంటి వాటిలో సామాన్యులు పెట్టుబడి పెట్టడం భారీ నష్టాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.


Click it and Unblock the Notifications