ఇరాన్ ప్రకటనతో పేలిన ముడి చమురు ధరల బాంబు.. $107 దాటిన క్రూడ్ ఆయిల్..
Crude Oil Prices: అంతర్జాతీయ చమురు మార్కెట్లో మళ్లీ ఆందోళన తీవ్రమైంది. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య శాంతి చర్చలు ప్రతిష్టంభనకు గురవడం.. వైట్ హౌస్ నుండి సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఆసియా, ఐరోపా ట్రేడింగ్ సెషన్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. గ్లోబల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ సోమవారం ట్రేడింగ్‌లో 3.2 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు $107.65 వద్ద క్లోజ్ కాగా.. అమెరికన్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) కూడా దాదాపు 2.3 శాతం పెరుగుదలతో $94.55 మార్కును దాటింది.
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, సైనిక కాల్పుల విరమణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్ సమర్పించిన ఏడు రోజుల తాత్కాలిక ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. ఈ తిరస్కరణ ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తీవ్రస్థాయిలో స్పందిస్తూ.. అమెరికా విధించిన ఆంక్షలు తొలగించి, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేసేవరకు తాము షరతులను సడలించేది లేదని స్పష్టం చేశారు. పరిస్థితి 'ప్రళయ యుద్ధం' (Doomsday War) స్థాయికి చేరినా సిద్ధమేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మార్కెట్ వర్గాలలో సరఫరా వ్యవస్థపై తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయి.

అయితే వ్యూహాత్మక దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదని తెలుస్తోంది. ఖతార్, ఇతర సంధానకర్తల ద్వారా మరిన్ని ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు ఈ వారంలో అమెరికా ప్రతినిధులు సమావేశమవుతారని ట్రంప్ తెలిపినప్పటికీ.. ఒప్పందంపై ఇరుదేశాల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ ముందస్తుగా ఆంక్షల ఎత్తివేతను డిమాండ్ చేస్తుంటే, అణు కార్యక్రమాలను శాశ్వతంగా నిలిపివేస్తే తప్ప ఎలాంటి రాయితీలు ఇచ్చేది లేదని వాషింగ్టన్ పట్టుబడుతోంది.
ఈ ఉద్రిక్తతల నడుమ మధ్యప్రాచ్యంలో రవాణా ముప్పు మరింత పెరిగింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని ఇంధన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో, రియాద్‌తో పాటు పలు కీలక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. ఇదే సమయంలో, దేశీయంగా పెరుగుతున్న ఇంధన ధరలను అదుపు చేసేందుకు అమెరికా డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించే ఆలోచనలో ఉందన్న వార్తలు అంతర్జాతీయంగా ప్రాసెస్ చేసిన పెట్రోలియం ఉత్పత్తుల కొరతను పెంచాయి.
ప్రపంచ చమురు రవాణాలో ఐదవ వంతు వాటా కలిగిన హోర్ముజ్ జలసంధి మూతపడి ఏడు నెలలు కావోస్తుండటంతో, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం) పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ వారంలో జరగబోయే ద్వైపాక్షిక చర్చల్లో కూడా పురోగతి కనిపించకపోతే, బ్రెంట్ క్రూడ్ ధరలు అతిత్వరలోనే బ్యారెల్‌కు $120 స్థాయిని తాకే అవకాశముందని కేపిటల్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్ ప్రకటనతో నేడు స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది. సోమవారం ఉదయం 11 గంటల సమయానికి స్టాక్ మార్కెట్‌లో తీవ్ర క్షీణత మధ్య, లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ శుక్రవారం నాటి రూ. 4,83,25,067.256 కోట్ల నుండి రూ. 4,75,91,117.68 కోట్లకు పడిపోయింది. అంటే కేవలం ప్రారంభ ట్రేడింగ్‌లోనే రూ. 7,33,949.576 కోట్ల నష్టం, లేదా సుమారుగా రూ7.34 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీనికి తోడు వచ్చే వారం ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచుతుందనే ఆందోళనలు పెరగడంతో మార్కెట్ పతనం ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications

