ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. వరుసగా రెండో రోజు కుప్పకూలిన క్రూడ్ ఆయిల్ ధరలు..
Crude oil prices: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న మృదువైన వైఖరి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం వరుసగా రెండవ రోజు కూడా కొనసాగింది. 2026 నవంబర్ 10 మంగళవారం నాడు బ్రెంట్ ముడి చమురు ధర 0.23% తగ్గి బ్యారెల్‌కు $92.33కి పడిపోగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి చమురు 0.40% క్షీణించి బ్యారెల్‌కు $86.50 వద్ద ట్రేడ్ అయింది.
ఇరాన్‌పై ప్రస్తుతం ఎలాంటి కొత్త సైనిక చర్యలు చేపట్టడం లేదని, దాడులను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ చేసిన సంచలన ప్రకటన చమురు మార్కెట్లలో ధరలు తగ్గడానికి ప్రధాన కారణమైంది. ఖతార్ ప్రధానమంత్రితో వైట్ హౌస్‌లో జరిగిన సమావేశం, మధ్యప్రాచ్యంలోని పలు దేశాల విజ్ఞప్తుల మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అనంతరం రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైట్ హౌస్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఇరాన్‌పై దాడులు వాయిదా వేసినప్పటికీ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై అమెరికా నావికా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో నౌకలపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నప్పటికీ, చమురు మార్కెట్ వీటిపై తీవ్ర ఆందోళన చెందకపోవడం గమనార్హం.

కేసీఎం ట్రేడ్ చీఫ్ మార్కెట్ అనలిస్ట్ టిమ్ వాటరర్ విశ్లేషణ ప్రకారం, హోర్ముజ్ పరిణామాల కంటే ట్రంప్ అనుసరిస్తున్న శాంతియుత ధోరణికే ఇన్వెస్టర్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ దాడులు చమురు ధరలను మళ్లీ విపరీతంగా పెంచి మార్కెట్‌కు ముప్పు తెచ్చేంత తీవ్రంగా లేవని, అందుకే సరఫరా అంతరాయాలపై భయాలు తగ్గాయని ఆయన వివరించారు.
అయితే, అమెరికా మరియు ఇరాన్‌ల మధ్య త్వరితగతిన శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై అమెరికా మరియు గల్ఫ్ దేశాల ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ భద్రతా మండలి అధిపతి మొహ్సెన్ రెజాయీ స్పందిస్తూ, ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయంటూ వ్యాపిస్తున్న అసత్య ప్రచారాన్ని అమెరికా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా, ఇరాన్ ముందుంచిన 7 ప్రధాన షరతులను అంగీకరించడానికి అమెరికాకు ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చమురు సరఫరాకు సంబంధించి మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. రాయిటర్స్ సర్వే ప్రకారం, 2026 అక్టోబర్ నెలలో 'ఒపెక్' (OPEC) దేశాల ముడి చమురు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ దేశాలు ఈ ఉత్పత్తి పెంపులో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, వీటి ఎగుమతులపై ఆంక్షలు ఇప్పటికీ అమలులోనే ఉన్నాయి.
మరోవైపు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ఊరట నిచ్చేలా రష్యా, ఉక్రెయిన్ అధికారుల మధ్య రెండు రోజుల చర్చలు మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి తర్వాత ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరుగుతున్న తొలి సమావేశం ఇదే కావడం విశేషం. అమెరికా మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ఈ చర్చల ద్వారా ఇరుదేశాల మధ్య సమగ్ర శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, అందులో యూరోపియన్ భద్రతా అంశాలు కూడా భాగమయ్యే అవకాశం ఉందని ట్రంప్ గత వారమే సూచించారు. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడి చమురు సరఫరా స్థిరపడటానికి దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications
