Pakistan Crisis: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న దాయాది పాకిస్థాన్లో పరిస్థితులు రోజురోజుకూ దయనీయంగా మారుతున్నాయి. ఈ పరిస్థితులను అడ్డుకోవాల్సిన ప్రభుత్వమే ప్రజలపై కొత్త భారాన్ని మోపుతోంది. ఈ క్రమంలో అక్కడ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
పక్క దేశాలపై కుయుక్తులు పన్నే పాక్ తన దేశంలోని పరిస్థితులను మాత్రం చక్కదిద్దుకోలేక పోతోంది. ఈ క్రమంలో అక్కడ పెట్రోల్ ధరలు మరో సారి పెరగనున్నాయి. రానున్న రెండు వారాల్లో పాక్ ప్రభుత్వం ధరను లీటరుకు రూ.10 నుంచి రూ.14 వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. అయితే డీజిల్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పాక్ లో పెట్రోల్ లీటరుకు ధర రూ.272గా ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ధరలను సవరించినట్లయితే రానున్న కాలంలో లీటరు ధర రూ.286కు చేరుకోనుంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు మూడు పూట్ల తిండి తినలేని పరిస్థితుల్లో అల్లాడుతున్నారు. ఈ క్రమంలో అధిక ద్రవ్యోల్బణం నిత్యావసరాలను కొనలేని స్థితికి సామాన్యులను తీసుకెళ్లగా.. తాజా ఇంధన పెంపులు ఈ పరిస్థితులను మరింత దిగజార్చవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ దేశాల కూటమి నిర్ణయించటంతో క్రూడ్ ధరలు క్రమంగా పుంజుకోవటం ప్రారంభించాయి. అయితే పెరిగిన ధరల భారాన్ని ప్రజలకు బదిలీ చేసే క్రమంలో పాక్ ప్రభుత్వం తాజా పెంపులను ప్రకటించిందని తెలుస్తోంది. జీరో జనరల్ సేల్స్ ట్యాక్స్‌తో పాక్ ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.50 వసూలు చేస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ ధరలను పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడానికి IMF కార్యక్రమాన్ని పునరుద్ధరించడానికి దాయాది ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా యూఏఈ నుంచి అప్పుగా నిధులను తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications