Pakistan Crisis: ఆర్థిక అల్లకల్లోలంలో చిక్కుకున్న పాకిస్థాన్ దాని నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కరువు, ద్రవ్యోల్బణం విలయతాండవం చేస్తుండటంతో పరిస్థితులు దివాలా అంచుకు చేరుకున్నాయి. కనీస అవసరాలను సైతం పొందలేని స్థితిలో పాక్ ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో పతనావస్తలో ఉన్న పాకిస్థాన్ కి 1 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అంగీకరించింది. ద్వైపాక్షిక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు IMFకి వెల్లడించింది. డిఫాల్ట్‌ను నివారించడానికి ఈ ఒప్పందం పాకిస్థాన్‌కు కీలకం అని పాక్ మీడియా పేర్కొంది.

ఇదే అంశంపై పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ కు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐఎమ్ఎఫ్ కి వెల్లడించిందని మంత్రి తెలిపారు. ఈ రుణ సాయాన్ని అందుకునేందుకు యూఏఈ అధికారులకు అందించాల్సిన డాక్యుమెంటేషన్ పనిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ ప్రస్తుతం నిమగ్నమై ఉందని ఆయన తెలిపారు.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు ఈరోజు చైనా నుంచి చివరి విడత సాయంగా 300 మిలియన్ డాలర్లను పొందనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇది చైనా బ్యాంక్స్ ICBC ఆమోదించబడిన $1.3 బిలియన్ల రుణ సదుపాయంలో భాగమని ఆయన వెల్లడించారు. దీనికి ముందు మార్చి 3న 500 మిలియన్ డాలర్లు, మార్చి 17న 500 మిలియన్ డాలర్లను ICBC పాకిస్థాన్ కి అందించింది.

ప్రస్తుతం పాక్ IMF నుంచి 1.1 బిలియన్ డాలర్ల విరాళాన్ని పొందేందుకు, 7 బిలియన్ డాలర్ల బెయిలవుట్ కార్యక్రమాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. పాక్ వద్ద విదేశీ మారక నిల్వలు కేవలం ఒక్క నెల చెల్లింపులకు సరిపడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌదీ అరేబియా, చైనా, యూఏఈ వంటి స్నేహపూర్వక దేశాలు ఆర్థిక సాయం చేసేందుకు కట్టుబడి ఉన్నాయి.


Click it and Unblock the Notifications