వచ్చే కొద్ది నెలల్లో దేశంలో ఆర్థిక పరిస్థితులు కఠినతరం కావొచ్చునని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. స్టాక్ మార్కెట్ నుండి విదేశీ పెట్టుబడిదారులు నిధులు ఉపసంహరించుకోవడం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాలకు దేశీయంగా వచ్చే ఒడిదుడుకులు తోడవుతాయని పేర్కొంది. మార్చిలో తమ ఆర్థిక పరిస్థితుల సూచీ (ఫైనాన్షియల్ కండిషన్స్ ఇండెక్స్-FCI) సున్నా దిగువకు చేరుకుందని, దేశీయ ఆర్థిక పరిస్థితులు క్షీణించడాన్ని ఇది సూచిస్తోందని తెలిపింది.

ఆర్థిక పరిస్థితులు కఠినం.. కానీ
ఎస్బీఐ సహా బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నాయని, ఇది రుణ వ్యయాల పెరుగుదలకు దారి తీయవచ్చునని పేర్కొంది. కానీ కరెంట్ ఖాతా లోటును తగ్గించడానికి, విదేశీ మారకపు నిల్వల బలోపేతానికి కేంద్రం చర్యలు అంతర్జాతీయ ప్రతికూలతలను, తట్టుకోవడానికి దోహదపడతాయని తెలిపింది. ఈక్విటీ, డెట్, మనీ, ఫారెక్స్ మార్కెట్‌లలో పదిహేను కీలక అంశాలను విశ్లేషించి, FCI సూచీని రూపొందించింది. 2022 ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో ఆర్థిక పరిస్థితులు కఠినం కావడంతో పాటు గత దశాబ్ద సగటు పరిస్థితులతో పోలిస్తే ఎక్కువ ఒత్తిడిలో ఉన్నాయని తెలిపింది.

చమురు ధరల ప్రభావం
చమురు ధరలు ఇటీవల భారీగా పెరిగాయని, దీంతో జీడీపీ, ద్రవ్యోల్భణం, కరెంట్ ఖాతా లోటు, రూపాయి, ద్రవ్యలోటు వంటి ప్రధాన ఆర్థిక సూచీలపై ప్రభావం పడుతోందని తెలిపింది. ఆర్బీఐ దాదాపు రెండేళ్లుగా వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగిస్తున్నప్పటికీ, 2022లో పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు 50 నుండి 75 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చు. ఇప్పటికే పలు బ్యాంకులు ఎంసీఎల్ఆర్‌ను పెంచాయి.

అది ఊరట
టెన్ ఇయర్ జీ-సెక్ యీల్డ్స్ మార్చి నెలలో 7 బేసిస్ పాయింట్లు పెరిగి 6.83 శాతానికి చేరుకుందని, 2019 జూన్ తర్వాత ఇదే గరిష్టమని తెలిపింది. 2013తో పోలిస్తే కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్భణం తక్కువగా ఉండటం ఊరట కలిగించే అంశమని తెలిపింది. అందుకే అప్పటి కంటే మాత్రం ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని తెలిపింది.


Click it and Unblock the Notifications