Economy news: ఆర్థిక వ్యవస్థపై క్రిసిల్ చీఫ్ ఎకానమిస్ట్ కీలక వ్యాఖ్యలు.. FY25 వృద్ధి అంచనాలు..
Crisil News: ప్రపంచం మొత్తం ఆర్థిక మందగమనంతో అల్లాడుతున్న వేళ.. భారత్ మాత్రం 'బ్రైట్ స్పాట్'గా వెలుగొందుతోంది. అయితే ఇది ఎంతో కాలం నిలవదని ఇప్పటికే పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ ఆర్థికవేత్త ఇండియన్ ఎకానమీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
FY25లో భారత ఆర్థిక వ్యవస్థ చక్రీయ మందగమనాన్ని(cyclical slowdown) ఎదుర్కోనుందంటూ ప్రముఖ పరిశోధనా సంస్థ మరియు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ ధర్మకృతి జోషి బాంబు పేల్చారు. ప్రపంచ మందగమన ప్రభావం మొదటి కారణం కాగా.. వడ్డీ రేట్లు సహా కఠిన ఆర్థిక పరిస్థితులు దేశీయ డిమాండ్‌ను ప్రభావితం చేస్తాయన్నారు. కాబట్టి FY25 కి గాను వృద్ధి రేటు 6.4 శాతం ఉండనున్నట్లు అంచనా వేశారు.

జూన్‌లోపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును తగ్గించే అవకాశం కనిపించడం లేదని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. లిక్విడిటీ పరిస్థితుల కారణంగా ఇండియాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఏడాదికి ఏడాది నెమ్మదిస్తాయని తెలిపారు. ఈసారి వ్యవసాయం అంత బలంగా లేకున్నా ఇతర రంగాలు దేశాభివృద్ధిని ముందుండి నడిపించినట్లు వెల్లడించారు. సవాళ్లు ఉన్నప్పటికీ గ్రామీణ మరియు వ్యవసాయ రంగాల నుంచి 7.3 శాతం వృద్ధిని అంచనా వేసినట్లు చెప్పారు.
ఈ ఏడాది భారత్ సహేతుకంగా పనిచేసి, వృద్ధి అంచనాలను అధిగమించినట్లు జోషి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించడం వృద్ధిపై ప్రభావం చూపినట్లు వెల్లడించారు. భవిష్యత్ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు ఇండియా మరింత ఊతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌లో ప్రైవేట్ పెట్టుబడులుకు పెద్దపీట వేయాలన్నారు.


Click it and Unblock the Notifications