World Cup: విమానయానంపై వరల్డ్ కప్ ఎఫెక్ట్.. భారీగా టిక్కెట్స్ రేట్లు పెంచేసిన ఎయిర్‌లైన్స్
World Cup: ఇండియాలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. ఉద్యోగులు ఆఫీసులను, విద్యార్థులు కాలేజీలను ఎగ్గొట్టి మరీ మ్యాచ్ లు చూసేందుకు ఆరాటపడతారు. ఇక వరల్డ్ కప్ సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. నేరుగా స్టేడియంకు వెళ్లి మ్యాచ్ వీక్షించేందుకు పోటీ పడుతుంటారు. ఇప్పుడు అదే విమాన ప్రయాణీకులకు పెద్ద తలనొప్పిగా తయారైంది.
భారత్ అంతటా అలుముకున్న క్రికెట్ ఫీవర్.. విమాన ఛార్జీలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అక్టోబర్ 29న లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇంగ్లండ్ తో భారత జట్టు తలపడనుంది. ఇందుకు అనుగుణంగా దేశీయ అగ్రశ్రేణి క్యారియర్లు ఇప్పటికే టిక్కెట్ ధరలను భారీగా పెంచేశాయి. గతంతో పోలిస్తే ఇవి అత్యంత ఖరీదుగా మారినట్లు తెలుస్తోంది.

ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి నేరుగా లక్నో వెళ్లి స్టేడియంలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించాలంటే భారీ మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండువైపులా ఛార్జీలను కలిపితే దాదాపు 79 వేల వరకు ఖర్చు అవుతుంది. సాధారణ రోజుల్లో ఇదే మొత్తంతో ఎంచక్కా ఢిల్లీ నుంచి బ్యాంకాక్ లేదా దుబాయ్ వెళ్లొచ్చు.
గూగుల్ సెర్చ్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ 29న ఢిల్లీ నుండి లక్నోకు వెళ్లాలనుకునే ప్రయాణీకులు ఎకానమీ క్లాస్ బుక్ చేసుకోవచ్చు. ఈ విభాగంలో టూ-వే టిక్కెట్ ఖరీదు 7 వేల 900 నుంచి 10 వేల 470 మధ్య ఉంది. అయితే బిజినెస్ క్లాస్ లో వెళ్లాలని చూస్తే మాత్రం జేబుకు చిల్లు పడినట్లే. ఎందుకంటే వీటి ధర 33 వేల నుంచి 79 వేలుగా ఉంది. సాధారణ రోజుల్లో వీటి ఖరీదు 20 నుంచి 60 వేలలోపే ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications