PMAY News: సొంతిల్లు కలిగి ఉండాలని ప్రతి మధ్యతరగతి వ్యక్తి కల. దానిని నిజం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సైతం చేయూతనిస్తోంది. ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం విషయంలో తన వంతు సాయం అందిస్తోంది. ఇందుకోసం బ్యాంకుల నుంచి పొందిన రుణంపై వడ్డీ రాయితీ కల్పిస్తోంది. PMAY ద్వారా దేశ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలుచేస్తోంది. అయితే గత కొంతకాలంగా ఇది అటకెక్కింది. దీని గురించి తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. గృహ రుణంపై గతంలో లభించిన వడ్డీ రాయితీని మళ్లీ అమలు చేస్తామని ప్రకటించారు. 2022లో దీనిని నిలిపివేసిన తర్వాత క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ కింద వడ్డీ రాయితీని తిరిగి ప్రవేశపెట్టడాన్ని పలువురు విశ్లేషకులు స్వాగతించారు.

'PM ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద 1 కోటి పట్టణ పేద మరియు మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాల కోసం 10 లక్షల కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. ఇందులో 2.2 లక్షల కోట్ల మేరకు కేంద్రం సహాయం చేస్తుంది. రాబోయే 5 ఏళ్లలో సరసమైన ధరలకు రుణాలను అందించడానికి ఈ వడ్డీ రాయితీ ఇవ్వనున్నాం' అని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
'పెరుగుతున్న గృహ రుణ రేట్లను సమర్థవంతంగా తట్టుకునేందుకు కొనుగోలుదార్లకు ఈ సబ్సిడీ ఉపశమనాన్ని అందిస్తుంది. తద్వారా సరసమైన ధరలో పేద, మధ్యతరగతి వారు ఇళ్లు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు' అని సురక్ష గ్రూప్ ప్రమోటర్ జాష్ పంచమియా తెలిపారు. అయితే ఇది సరిపోదని, ఇండెక్సేషన్ ప్రయోజనాలు లేకుండా ఆస్తి అమ్మకాలపై 12.5 శాతం LTCG పన్ను విధించడం ఈ రంగానికి పెద్ద ఎదురుదెబ్బ అని పారడిం రియాల్టీ CMD పార్త్ మెహతా అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications