ప్రజలు బ్యాంకులో ఇప్పుడు డబ్బులు దాచుకోవడం లేదు..ఈ షాకింగ్ మార్పుకు కారణం ఏంటంటే..
ఒకప్పుడు ప్రజలు తమ పొదుపులను భద్రంగా ఉంచుకోవడానికి బ్యాంకులకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు), పొదుపు ఖాతాలు (సేవింగ్స్ అకౌంట్లు) ప్రధాన పెట్టుబడి మార్గాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదిక ప్రకారం, గృహ పొదుపులు వేగంగా తగ్గుతున్నాయి. ప్రజలు అధిక రాబడి కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, ఇతర పెట్టుబడి సాధనాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీని వలన బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
క్రిసిల్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థిర డిపాజిట్లలో పెట్టుబడులు తగ్గుతున్నాయి. అంతేకాక, బ్యాంకుల కరెంట్ ఖాతాలు, సేవింగ్స్ ఖాతాలు (CASA) లో బ్యాలెన్స్‌ల వాటా కూడా తగ్గుతోంది. ఈ మార్పు కేవలం తాత్కాలిక ధోరణి కాకుండా, మధ్యకాలం, దీర్ఘకాలంలో బ్యాంకులకు ఒక పెద్ద సవాలుగా మారవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది. ముఖ్యంగా లిక్విడిటీ సంక్షోభం లేదా నగదు కొరత ఏర్పడినప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

క్రిసిల్ విశ్లేషణ ప్రకారం.. డిపాజిటర్లు ఇప్పుడు కేవలం భద్రత కంటే ఎక్కువ రాబడిని కోరుకుంటున్నారు. సంప్రదాయ బ్యాంక్ డిపాజిట్లలో వడ్డీ రేట్లు పరిమితంగానే ఉండటంతో, ప్రజలు మూలధన మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్‌లు వంటి అధిక లాభదాయక పెట్టుబడుల వైపు అడుగులు వేస్తున్నారు. ఇది ఒకవైపు ఆర్థిక వ్యవస్థ పరిపక్వతను సూచించినా, మరోవైపు బ్యాంకుల డిపాజిట్ స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది.
డేటా ప్రకారం మార్చి 2020లో బ్యాంక్ deposits బేస్‌లో గృహరంగం వాటా 64 శాతం ఉండగా, మార్చి 2025 నాటికి అది 60 శాతానికి తగ్గింది. అంటే కేవలం ఐదు సంవత్సరాల్లో గృహ పొదుపుల వాటా నాలుగు శాతం తగ్గిపోయింది. ఈ ధోరణి కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో గృహ విరాళాలు మరింత తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ అంచనా వేస్తోంది.
గృహ పొదుపులు తగ్గిపోతే.. బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడానికి అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేయాల్సి రావచ్చు. దీని వలన బ్యాంకుల రుణ ఖర్చులు నేరుగా పెరుగుతాయి. రుణాల వడ్డీ రేట్లు కూడా పెరిగి, వ్యాపారాలు, వ్యక్తులపై అదనపు భారంగా మారే అవకాశం ఉంది. దీని వలన క్రెడిట్ వృద్ధి మందగించడం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ సమస్యపై స్పందించింది. బ్యాంకులను CASA డిపాజిట్లను మెరుగుపరచాలని సూచించింది. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (MSMEలు), వ్యవసాయరంగానికి మరింత రుణాలు ఇవ్వాలని ప్రోత్సహించింది. మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం.. CASA డిపాజిట్లు మెరుగుపడితే బ్యాంకులు తక్కువ ఖర్చుతో నిధులను సమీకరించి, ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలకు రుణాలను సులభంగా అందించగలుగుతాయి.
ఏదేమైనా గృహ పొదుపుల తగ్గుదల భారత బ్యాంకింగ్ రంగానికి ఒక నిశ్శబ్ద హెచ్చరిక లాంటిదే. ప్రజలు పెట్టుబడుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతుండగా, బ్యాంకులు తమ డిపాజిట్ బేస్‌ను నిలబెట్టుకోవడం ఒక కష్టమైన పని అవుతోంది. రాబోయే సంవత్సరాల్లో బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం, కొత్త డిపాజిట్ ఉత్పత్తులను అందించడం లేదా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా మరిన్ని డిపాజిటర్లను ఆకర్షించడం వంటి వ్యూహాలను అవలంబించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications