CRED Scam: తమ యాప్‌ను ప్రమోట్ చేసుకునేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు పలు సంస్థలు యూజర్లకు చిన్నపాటి గేమ్స్ నిర్వహించి ప్రైజెస్ అందజేస్తుంటాయి. అన్ని కంపెనీలు విశ్వసనీయమైనవి కానప్పటికీ కొన్ని ప్రముఖ సంస్థలపై మాత్రం ప్రజలకు అపార నమ్మకం ఉంటుంది. క్రెడిట్ బిల్ పేమెంట్ యాప్‌గా అందరికీ పరిచయమై పలు ఇతర సేవలను కూడా ప్రవేశపెట్టిన 'క్రెడ్' విశ్వసనీయ కంపెనీల్లో ఒకటిగా పేరుగాంచింది.
బెంగళూరుకు చెందిన ఒక వినియోగదారుడు 'CRED' తనను మోసం చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల 3.25 లక్షల విలువైన జాక్‌పాట్‌ను తాను గెలుచుకున్నట్లు చెప్పాడు. అయితే 'సాంకేతిక లోపం' పేరిట కంపెనీ ఆ బహుమతిని రద్దు చేసిందని ఆవేదన చెందాడు. విజయం సాధింంచిన ఉత్సాహం ఎంతోసేపు మిగలలేదని లబోదిబోమన్నాడు.

CRED ఫ్రైడే జాక్‌పాట్ ఆడిన అవిరల్ సంగల్ మ్యాక్‌బుక్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ మరియు TUMI బ్యాగ్‌ను గెలుచుకున్నట్లు తన పోస్టులో పేర్కొన్నాడు. TDS ప్రయోజనాల కోసం పాన్ వివరాలను అందించమని కంపెనీ తనను సంప్రదించినట్లు చెప్పుకొచ్చాడు. వాటిని అందించిన తరువాత అకస్మాత్తుగా బహుమతిని రద్దు చేశారని ఆరోపించాడు. కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ షాను ట్యాగ్ చేస్తూ సంగల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
పాన్ సమాచారాన్ని సమర్పించిన తర్వాత, సాంకేతిక సమస్య కారణంగా జాక్‌పాట్ రద్దు చేయబడిందని తెలియజేసేందుకు సంగల్‌కు CRED నుండి కాల్ వచ్చింది. అయినప్పటికీ సహృద్భావంతో కంపెనీ అతడి అకౌంట్‌లో రూ. 1000 జమ చేసింది. అతడు ఆడటానికి ఉపయోగించిన పాయింట్లను తిరిగి చెల్లించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సంగల్.. సిగ్గులేకుండా CRED తనకు పాయింట్లతో పాటు వెయ్యి క్యాష్‌బ్యాక్‌ని తిరిగి ఇవ్వడానికి మళ్లీ కాల్ చేసిందని దాన్ని తిరస్కరించానంటూ నిరాశ వ్యక్తం చేశాడు.
బగ్ కారణంగా 200 మంది వినియోగదారులు జాక్‌పాట్‌ను గెలుచుకున్నారని కంపెనీ వెల్లడించినట్లు అతడు తర్వాత మరో అప్‌డేట్‌ను పంచుకున్నాడు. సమస్యను పరిష్కరించి విజేతలను గౌరవించడానికి బదులు రివార్డులను రద్దు చేయాలనే కంపెనీ నిర్ణయాన్ని సంగల్ విమర్శించాడు. ఇదే విషయాన్ని CREDకు తెలియజేశానని, వారు అలా చేయకపోతే చట్టపరంగా ముందుకెళ్లే అవకాశాలను పరిశీలిస్తానని తెలిపాడు.


Click it and Unblock the Notifications