CRED: AI మీద క్రెడ్ CEO కీలక కామెంట్స్.. మరో పదేళ్లలో జరిగేది ఇదేనట!
CRED: ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ.. ఉద్యోగులకు మరో భయం పట్టుకుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పటికే ఎందరో కొలువులు కోల్పోయారు. కాగా భవిష్యత్తు మరింత భయానకంగా ఉంటుందని పలువురు టెక్ కంపెనీల అధినేతలు పేర్కొంటూ ఉండటం అగ్నికి ఆజ్యం పోసినట్లువుతోంది.
ప్రముఖ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ యాప్ క్రెడ్ వ్యవస్థాపకులు, CEO కునాల్ షా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. AI వినియోగం వల్ల వచ్చే 10 ఏళ్లలో దాదాపు 90 శాతం మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్లు చెప్పి షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023లో ఈ మేరకు స్పందించారు.

'ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కంపెనీలు తమ సిబ్బంది నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడి పెట్టాలని కొందరు వాదిస్తున్నారు. అయితే
వారు అంత త్వరగా స్కిల్స్ డెవలప్ చేసుకోలేరని నా అభిప్రాయం. నైపుణ్యం పెంచుకునే సమయం చాలా సవాళ్లతో కూడి ఉంటుంది. అందరూ దీన్ని సాధిస్తారని చెప్పలేం. అందుకే ఒకరకంగా ప్రతి ఒక్కరి ఉద్యోగం ప్రమాదంలో ఉన్నట్లే' అని ఫిన్ టెక్ యూనికార్న్ CRED CEO పేర్కొన్నారు.
తాను ఏ AI కంపెనీలో పెట్టుబడులు పెట్టలేదని షా స్పష్టం చేశారు. అయితే ఇండియా నాణ్యమైన AI ఉత్పత్తులను సృష్టించగలదని భావిస్తున్నట్లు చెప్పారు. LLM (లార్జ్ లాంగ్వేజ్ మోడల్)ను నిర్మించడంలో భారతీయ వ్యవస్థాపకులు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ChatGPT ప్రారంభం తర్వాత ఈ భయాందోళనలు ఎక్కువకాగా.. భవిష్యత్తులో మరెన్ని చూడాల్సి వస్తుందోనని ఉద్యోగుల్లో ఆవేదన నెలకొంది.


Click it and Unblock the Notifications