Covid 19 emergency credit line: SBI ఎమర్జెన్సీ లోన్‍తో ఊరట, కాలపరిమితి, వడ్డీ ఎంతంటే?
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆయా రంగాల కంపెనీలు తమకు తోచిన విధంగా సహకరించేందుకు ముందుకు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు ఇస్తే, మరికొన్ని రంగాలు ఉచితంగా అందించడం వంటివి చేస్తున్నాయి. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎమర్జెన్సీ లోన్లతో ముందుకు వచ్చింది.

కరోనా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్
వ్యాపార, పారిశ్రామిక రంగాలపై కరోనా తీవ్రప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ఎమర్జెన్సీ రుణసౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. కరోనా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ (CECL) సదుపాయం ద్వారా రూ.200 కోట్ల వరకు రుణాలు అందిస్తామని ప్రకటించింది. జూన్ 30వ తేదీ వరకు ఈ రుణాలను పొందే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఎస్బీఐ ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది.

12 నెలల కాలపరిమితి.. 7.25 శాతం వడ్డీ
ఈ ప్రత్యేక రుణ కాలపరిమితి 12 నెలలు. వడ్డీరేటు 7.25%. కరోనాతో వ్యాపారం పరంగా ప్రభావితమైనవారికి ఈ రుణాలు ఊరటనిస్తాయని ఆశిస్తున్నామని, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో CECLతో అదనపు నగదు లభ్యత పెరుగుతుందని, కాబట్టి అర్హులైన వారికి ఈ రుణ సదుపాయాన్ని అందించాలని ఎస్బీఐ.. బ్రాంచీలకు జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.

వారికి రుణ సదుపాయం
ఈ నెల 16 నాటికి స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ (SMA) 1 లేదా 2గా వర్గీకరించని అన్ని ఖాతాలకు కూడా ఈ రుణం సదుపాయం ఉందని ఎస్బీఐ తెలిపింది. ఎన్పీఏలు లేదా నిరర్థకంగా మారేందుకు అవకాశమున్న ఖాతాలను గుర్తించేందుకు SMAలను ప్రవేశపెట్టారు.

సంస్థలకు నగదు కొరత సమస్య
దేశంలో 50% పైగా సంస్థలు తమ కార్యకలాపాలపై వైరస్ ప్రభావాన్ని చూస్తున్నాయని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ చెబుతోంది. దాదాపు 80% సంస్థలకు నగదు కొరత సమస్య ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లోను మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. 300 మందికి పైగా ఈ వ్యాది బారిన పడ్డారు. ఈ మహమ్మారి కారణంగా వ్యాపార, పారిశ్రామిక రంగాలు కుదేలవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ యావత్తూ కుంటుపడుతోంది. ముఖ్యంగా వ్యాపారులకు నగదు కొరత సమస్య వస్తోంది. దీంతో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్‌ను ప్రారంభించింది.


Click it and Unblock the Notifications